నిండామునిగిన దీదీని లేఖలు రక్షిస్తాయా?
Publish Date:Mar 30, 2022
Advertisement
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఓ వంక మేనల్లుడు, పార్టీ ఎంపీ, అభిషేక్ బెనర్జీ మెడ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. బొగ్గుకుంభకోణంకేసులో, అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీని ఈడీ అధికారులు గత వారం పదిరోజులుగా విచారిస్తున్నారు. అభిషేక్ బెనర్జీ తన తండ్రి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రెండు కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడ్డారనేది, అయన పై ఉన్న ప్రధాన ఆరోపణ. అందుకు అనుబంధంగా అక్రమ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తాల్లో ఆస్తులు కూడాబెట్టినట్లు వచ్చిన అభియోగాలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. మరో వంక అభిషేక్ అతని భార్య అభియోగాలపై విచారణ నిలిపివేయాలంటూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు, కానీ, కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో, ఎప్పుడు ఏమి జరుగుతుందో, అనే ఆందోళన మమతా దీదీని వెంటాడుతోందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, బీర్భూమ్ సామూహిక హత్యాకాండ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరో వంక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను విధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలను కేంద్ర ప్రభుత్వం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుంది. ఇక ఇప్పుడు గతంలోలాగా,కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఉల్లంఘించడం సీఎస్, డీజీపీలకు కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అమలు చేయవలసి ఉంటుంది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సీఎస్, డీజీపీ అమలు చేయవలసి ఉంటుంది. ధిక్కరిస్తే, గవర్నర్ సిఫార్సుపై రాష్ట్రపతి ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనివార్యమవుతుంది. మరోవంక బీర్భూమ్ ఘటనపై ప్రత్యేక విచారణ బృందం (‘సిట్’) విచారణతో సరిపెట్టాలని, మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. రాష్ట్ర హై కోర్టు, ప్రభుత్వ అభ్యర్ధనను తోసి పుచ్చింది. ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిదిమంది సజీవదహనమైన బీర్భూమ్ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, హై కోర్ట్ ఆదేశించింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే, ‘సిట్’ విచారణ సక్రమంగా జరుగుతుందనే విశ్వాసం లేదని, న్యాయ స్థానం చెప్పకనే చెప్పింది. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపక పోయినా, హై కోర్ట్ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలోనూ మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఒక విధంగా ఒంటరి పోఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం అన్నట్లుగా, మమతా బెనర్జీపై బీజేపీనే ముప్పేట దాడి చేస్తున్నా, పార్లమెంట్ లోపల బయట ఎక్కడ కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవీ మమతకు మద్దతు ఇవ్వడంలేదు. ముఖం చాటేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య మమత బెనర్జీ- మరోసారి బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నాలకు తెర తీశారు. ఈ మేరకు ఆమె ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్న మమతా బెనర్జీ, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు అందరూ ఒకట వ్వాలని ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసంగా, అందరికీ అనుకూలమైన తేదీలలో, అనుకూలమైన ప్రదేశంలో సమావేశమై, బీజేపీఫై ఉమ్మడి పోరుకు కర్యాచరణ ప్రణాళికను రూపొందిద్దామని, లేఖలో పేర్కొన్నారు, అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ వ్యూహాలను నమ్ముకుని, కాంగ్రెస్, ఎన్సీపీ సహా ప్రధాన పార్టీలను తూలనాడిన మమతా బెనర్జీ, పెగాసస్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఫై నిరాధార ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ, తమ అవసరం కోసం తగుదునమ్మా అని, అందరం కలుద్దామని ఏకమై పోరాడదామని అంటే, ఆమెను ఎవరు నమ్ముతారు, ఎవరు ఆమె లేఖను సీరియస్’గా తీసుకుంటారని బీజేపీ వ్యతిరేక పార్టీలే, అనుమానాలు వ్యక్త పరుస్తున్నాయి. మహా అయితే అదే పడవలో ప్రయాణిస్తున్న, తెరాస అధినేత కేసీఆర్ వంటి ఒకరిద్దరు ఓకే అంటే అనచ్చుగానీ, మమతా బెనర్జీ లేఖ, ప్రభావం పెద్దగా ఉండదని పైగా విపక్షాల అనైక్యతను మరో మారు దేశం ముందు ఉంచుతుందని అంటున్నారు.
ఈ పరిణామాలతో మమత బెనర్జీ ఉక్కిరబిక్కిరి అవుతున్నారు. బీర్భూమ్ ఉదంతంలో ప్రభుత్వ ప్రమేయం గానీ, తమ పార్టీ నాయకుల జోక్యం గానీ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నప్పటికీ.. అది ఫలించట్లేదు.
http://www.teluguone.com/news/content/mamata-writes-letters-to-non-bjp-cms-39-133686.html





