వీఐపీల భద్రతలో భారీ కోత..రేవంత్ సర్కార్ నిర్ణయానికి కారణమేంటంటే?
Publish Date:Jun 29, 2026
Advertisement
తెలంగాణలో వీఐపీల భద్రతలో సీఎం రేవంత్ భారీగా కోత విధించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు అందిస్తున్న సెక్యూరిటీని భారీగా తకోత విధించాలని తీసుకున్న అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ప్రభుత్వం కుదించడంతో వివాదం మరింత ముదిరింది. ప్రవీణ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ.. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇదంతా నిబంధనల మేరకే ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎవరికైనా నిజంగా ప్రాణభయం ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని.. భద్రత కుదింపు అంశాన్ని రాజకీయం చేయొద్దనీ అధికారులు అంటున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది. అదలా ఉంటే.. ఈ సానుకూల మార్పులను నిశితంగా సమీక్షించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇకపై కొంతమంది ప్రముఖులకు గతంలో ఇచ్చిన విధంగా అదనపు భద్రతను కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అందులో భాగంగానే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వంద మంది ప్రముఖులకు ప్రస్తుతం అందుతున్న వివిధ రకాల భద్రతా సౌకర్యాలను పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా కుదించడమో చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇందులో భాగంగా వీఐపీలకు కేటాయించిన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు గన్‌మెన్‌ల సౌకర్యాలను కూడా వెనక్కి తీసుకోనున్నారు. గతంలో కొందరి ప్రముఖుల రక్షణ కోసం "వన్ ప్లస్ వన్ స్థాయి సెక్యూరిటీ ఉండగా, మరికొందరి రక్షణ కోసం అత్యంత కీలకమైన టూ ప్లస్ టూ స్థాయి గన్‌మెన్‌ల భద్రత ఉండేది. ఇప్పుడు ఈ క్యాటగిరీలన్నింటినీ పునఃసమీక్షించి భారీగా కోత విధించింది. ఈ కోత మంగళవారం (జులై 1) నుంచే అమలులోకి రానుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ క్యాటగిరీలలో భద్రత కల్పిస్తోంది. ఈ భారీ జాబితాలో ప్రస్తుత, మాజీ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, సమాజంలో పలుకుబడి ఉన్న ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బందిని, వనరులను కేవలం వీఐపీల భద్రతకే పరిమితం చేయడం కంటే, ప్రజా రక్షణకు మళ్లించడం ఎంతో ఉత్తమమని ప్రభుత్వం యోచిస్తోంది. మావోయిస్టు ముప్పు లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే వృథా వ్యయాన్ని భారీగా అరికట్టవచ్చని, అలాగే పోలీసు వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.
http://www.teluguone.com/news/content/major-cut-in-vip-security-36-224510.html





