మహా ‘పరీక్షలో షిండే విజయం.. మధ్యంతర ఎన్నికలపై పవార్ జోస్యం
Publish Date:Jul 4, 2022
.webp)
Advertisement
నాటకీయ పరిణామాల నడుమ జూన్ 30న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన, శివసేన తిరుగుబాటు నాయకుడు, ఏక్నాథ్ షిండే ఈ రోజు ( సోమవారం) రాష్ట్ర శాసన సభలో సభలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు షిండే’కు మద్దతుగా నిలిచారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే 20 ఎక్కువ ఓట్లు సాధించారు. ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. దీంతో షిండే తిరుగుబాటుతో మొదలైన మహా సంక్షోభం షిండే విజయంతో, ముగింపు కొచ్చింది. మరోవైపు, శివసేన చీఫ్ విప్గా సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ జూలై 11 న విచారణకు వస్తుంది. అయితే, కోర్టు తీర్పు ఎటు వచ్చినా, షిండే సర్కార్’ కు తక్షణ ముప్పు వచ్చే ప్రమాదం లేదని, న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు. కాగా, ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి షిండే అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. షిండే వర్గంలోకి చేరారు. అయితే షిండే ప్రభుత్వం అట్టేకాలం ఉండదని, ఎన్సీపీ అధినేత సరద పవార్ జోస్యం చెప్పారు. మహా అయితే ఆరు నెలలు, కాదంటే ఇంకా ముందుగానే షిండే సర్కార్ ‘కూలి పోతుందని, పవార్ జోస్యం చెప్పారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, అందుకే మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. షిండేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా షిండే ప్రభుత్వం పతనమవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు. అలాగే, శివసేన ఠాక్రే, వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కూడా షిండే సర్కార్ ‘ కు మద్దతు ఇస్తున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసలైన శివసేన నేతలు కాదని, అలా అని వారు చెప్పుకోలేరని అన్నారు. శివసేన గుర్తు పై గెలిచిన షిండే వర్గం ఎమ్మెల్యేలు, రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పడు తిరుగుబాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేము కోర్టులోనే తేల్చుకుంటాం, అని అన్నారు. అయితే రేపు ఏమి జరుగుతుంది, నేది పక్కన పెడితే, ఇప్పటికైతే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బల పరీక్షలో నెగ్గారు. జో జీతేగా ఓయి సికిందర్’
http://www.teluguone.com/news/content/maharashtra-cm-shinde-wins-floor-test-25-139044.html












