‘మహాపాదయాత్ర’పై మళ్లీ పోలీస్ ఆంక్షలు.. కావలిలో కదనోత్సాహం..
Publish Date:Nov 22, 2021
Advertisement
అమరావతి రైతులు పట్టువదలడం లేదు. కాలినడక ఆపడం లేదు. మహా పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఊరూరా స్థానికులు రైతులకు పూలాభిషేకం చేస్తున్నారు. మేము సైతమంటూ కదం కదం కదుపుతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా పాదయాత్రలో భాగస్వామ్యమవడం మరింత జోష్ నింపింది. ఇంకేముందు.. పోలీసులు మళ్లీ వాలిపోయారు. పాదయాత్రలో ఎక్కువ మంది పాల్గొన్నారంటూ ఆంక్షలు విధించారు. లాఠీ దెబ్బలకే వెరవని రైతులను.. ఇలాంటి ఆంక్షలు అడ్డుకోగలవా? అందుకే, 22వ రోజు మహా పాదయాత్ర అంతే ఉత్సాహంగా దూసుకుపోతోంది. అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 22వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 13 కిలోమీటర్ల మేర సాగి కొండ బిట్రగుంటలో ముగియనుంది. అంతక ముందు రైతులు స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు. ‘మహాపాదయాత్ర’కు స్థానికులు నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబర్ 15కు తిరుమలకు చేరనుంది. ప్రస్తుతం నెల్లూరులో మహా పాదయాత్ర ముందుకు సాగుతోంది.
http://www.teluguone.com/news/content/maha-padayatra-at-nellore-39-126840.html





