రెడ్‌బుక్ చాప్టర్3లో ముగ్గురి పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశి.. మూడో వ్యక్తి ఎవరు?
Publish Date:Nov 2, 2024
Advertisement
రెడ్‌బుక్.. ఈ పేరు వింటేనే. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి వైసీపీ నేతల వరకు అందరిలోనూ ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. వైసీపీ ఐదేళ్ల హయాంలో నిబంధనలు తుంగలో తొక్కి కొందరు అధికారులు, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని జైళ్లకు పంపించి చిత్రహింసలకు గురిచేశారు. కొందరు వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ప్రతిపక్షంలోఉన్న సమయంలో నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’లో నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, అప్పట్లో వైసీపీ నేతలు రెడ్‌బుక్‌పై వెటకారంగా మాట్లాడారు. కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్ పేరు వింటేనే వైసీపీ భయంతో వణికి పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే లోకేశ్ రెడ్‌బుక్ ఓపెన్ చేశారు. రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే రెడ్‌బుక్ ప్రభావం కనిపించడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఢిల్లీకివెళ్లి ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా జగన్ గగ్గోలు పెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ ‘రెడ్‌బుక్’ అంటుంటే నవ్వుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తరువాత రెడ్‌బుక్ అంటేనే వణికిపోతున్న పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం శ్రేణులను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిపై ఇప్పటికే రెడ్‌బుక్ ఛాప్టర్1, ఛాప్టర్2 ఓపెన్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఛాప్టర్1లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేసి జైళ్లకు పంపించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై విచారణలు జరుగుతుండగా.. కొందరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. మరి కొందరిని సస్పెండ్ చేశారు. రెడ్‌బుక్ ఛాప్టర్2లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు మొదలు పెట్టారు. అదే విధంగా అధికార మదంతో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు జైలు కెళ్లగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లోకేశ్ తాజాగా‘రెడ్‌బుక్’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఛాప్టర్3లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేశ్ వారం రోజులు అమెరికాలో పర్యటించారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట అమెరికాలోని అట్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్ గురించి ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్‌బుక్ ఛాప్టర్3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. అయితే, రెడ్‌బుక్ ఛాప్టర్3 ఓపెన్ కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్ట పడాలని లోకేశ్ సూచించారు. దీంతో ఛాప్టర్3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉండబోతున్నాయని లోకేశ్ చెప్పకనే చెప్పారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నందమూరి, చంద్రబాబు కుటుంబాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వంశీపై తెలుగుదేశం శ్రేణులే కాదు, ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వంశీపై కేసు నమోదైంది. త్వరలో వంశీపై అంతకన్నా తీవ్రమైన కేసులు నమోదు కాబోతున్నాయని, జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ చెప్పకనే చెప్పారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రెడ్‌బుక్ ఛాప్టర్3లో కొడాలి నాని పేరుకూడా ఉంటుందని లోకేశ్ హింట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబును ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించాడు. పవన్ కల్యాణ్, లోకేష్ పైనా అనేక సార్లు నోరుపారేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాలి నాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాప్టర్ -3లో నాని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత పేరుకూడా రెడ్‌బుక్ ఛాప్టర్3లో ఉందని ప్రచారం జరుగుతుంది. అతను జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి వ్యక్తి అని, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. త్వరలో మరో కేసు నమోదు కాబోతుందని, ఆ కేసులో సదరు వ్యక్తి జైలు కెళ్లడం ఖాయమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెడ్ బుక్ ఛాప్టర్ -3 అనగానే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందట. మొత్తానికి రెడ్ బుక్ అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా లోకేశ్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
http://www.teluguone.com/news/content/lokesh-to-open-redbook-chapter-three-39-187800.html