జెన్ జడ్ ఉద్యమానికి పరిమిత మద్దతు.. రాహుల్ చేజార్చుకున్న అవకాశం.!
Publish Date:Jul 21, 2026
Advertisement
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా యువత చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఇండియాలో జన్ జడ్ చేపట్టిన అతి పెద్ద ఆందోళనను అవకాశంగా మలచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ యువత ఉద్యమం విషయంలో స్పందించిన తీరు, ప్రకటించిన పరిమిత మద్దతు కాంగ్రెస్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని ‘చే’జారేలా చేశాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఉధృత పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు యువత పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తరువాత కూడా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వారికి మద్దతుగా కేంద్రాన్ని నిలదీయడంలోవిఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న యువతలో నెలకొన్న ఆందోళనను, వారి ఆగ్రహాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అపారమైన రాజకీయ ప్రయోజనం లభించేది. అదే సమయంలో ఒక జాతీయ స్థాయి అగ్రనేత తమ మధ్యకు వస్తే, పోరాటం చేస్తున్న యువకులకు సైతం కొండంత అండ లభించేది. ఈ పరిణామం ఉభయతారకంగా ఇరు వర్గాలకు ఎంతో ఉపయోగపడేది. కానీ, రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు వెళ్లకుండా దూరంగా ఉండటం వల్ల ఆందోళనకు కావాల్సిన స్థాయిలో ఊపు లభించకపోగా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన మైలేజ్ కూడా దక్కకుండా పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన ఏడాది కాలపు రైతాంగ ఉద్యమంలో కానీ, మణిపూర్ హింసాకాండ బాధితుల పరామర్శలో కానీ రాహుల్ గాంధీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ దూకుడు ప్రదర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్వయంగా వీధుల్లోకి వచ్చిన రాహుల్, ఇప్పుడు అత్యంత కీలకమైన యువజన సమస్యపై మాత్రం జంతర్ మంతర్ ప్రాంగణానికి దూరంగా ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. మీడియా వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉద్యమ తీవ్రత పెరగదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ దశలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో నేరుగా పాల్గొనకపోతే, అధికార పక్షం ఈ ఆందోళనలను మరింత సులువుగా అణచివేసే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస జరుగుతున్న నేపథ్యంలో, వెలుపల ఉవ్వెత్తున లేస్తున్న ప్రజా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం చూపుతున్న మందకొడి వైఖరిపై సొంత పార్టీ వర్గాల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ముందుముందు జరగబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా జంతర్ మంతర్ ఉద్యమ క్షేత్రంలోకి దిగుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత సమస్యలను కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, స్వయంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొంటేనే నిజమైన ప్రతిపక్ష నేతగా ప్రజలలో మరింత నమ్మకం ఏర్పడుతుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ లోపల వెలుపల జరగబోయే పోరాటాల దృష్ట్యా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి, ఉద్యోగ పోరాటంలో ఉన్న యువతకు నేరుగా అండగా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. Jantar Mantar Protest Delhi, Rahul Gandhi Youth Protest, Leader of Opposition Strategy, Opposition Leaders Support
ఢిల్లీ వేదికగా మారుమోగుతున్న యువత ఉద్యమానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవిద్ కేజ్రీవాల్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి నేతలైతే.. స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న యువతను కలిసి సంఘీభావం ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం జంతర్ మంతర్ నిరసన శిబిరానికి వచ్చి యువతకు సంఘీభావం తెలపలేదు. ఇదే విషయం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలు, ఉద్రిక్తతల మధ్య గాయపడిన కొందరు యువకులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ రాహుల్ గాంధీ.. ఆందోళన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు వెళ్ల లేదు. కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రకటనలు విడుదల చేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన యువజనంతో నేరుగా మమేకం కాకుండా మద్దతు ప్రకటనలకు పరిమితం కావడం ద్వారా పొలిటికల్ మైలేజీకి ఈ ఉద్యమాన్ని ఊతం చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/limited-support-for-the-gen-z-39-226669.html




