ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం.!
Publish Date:Nov 5, 2026
Advertisement
మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 5) షురూ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరి కొన్ని చోట్ల భారీ వర్షాల కారణంగా పొలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 31 వేల 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రమారమి 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం అధికారులు భారీగా సిబ్బందిని మోహరించారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల కారణంగా ఎన్నికలను వాయిదా వేసి శుక్రవారం(నవంబర్ 6) పోలింగ్ నిర్వహించి, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు, బాపట్ల, కాకినాడ తదితర జిల్లాల్లోనూ ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఓటర్లు వెనకడుగు వేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదలా ఉంటే.. కడప జిల్లాతో పాటు పల్నాడు, మన్యం జిల్లాల్లో కొన్ని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు,తోపులాటలూ చోటు చేసుకున్నాయి. పులివెందుల నియోజకవర్గ పరిధిలో నందలూరు మండలం ఎర్రిపాపయ్యగారి పల్లెలో పోలింగ్ కేంద్రాల వద్ద బయటి వ్యక్తుల సంచారంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకుని గుంపులను చెదరగొట్టాల్సి వచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 7వ తేదీన చేపట్టనున్నారు. పోలింగ్ సజావుగా ముగిసేలా ప్రతి కేంద్రం వద్ద పర్యవేక్షణను కట్టుదిట్టం చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన నిఘా ఉంచామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. [AP MPTC ZPTC Elections Poling, Largely Peaceful, AP Local Body Elections, Kadapa, Palnadu, Manyam Districts, Tense, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-mptc-zptc-elections-poling-39-236369.html




