అసెంబ్లీలో మద్యం మంట..చంద్రబాబు వర్సెస్ కిరణ్
Publish Date:Feb 25, 2012
Advertisement
హైదరాబాద్: మద్యం ముడుపుల వ్యవహారంపై శుక్రవారం శాసన సభ అట్టుడికింది. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభాపర్వంలో నేతల స్వరం ప్రతిధ్వనించింది. ‘ఎసిబి కేసులో నువ్వు ముద్దాయివి’ అంటూ విపక్షనేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘నువ్వు సిగ్గూ లజ్జా లేని ముఖ్యమంత్రివి. ముద్దాయిని అంటున్నావ్‌గా, సభలో సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నన్ను అరెస్టు చేయించు. ముఖ్యమంత్రికి ఎలాగూ జైలు తప్పదు’ అంటూ విపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మద్యం ముడుపుల వ్యవహారంపై చర్చ ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో చర్చ ముగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
కాగా, మద్యం ముడుపులపై ఇప్పటి వరకూవున్న ఎసిబి విచారణ సమాచారం మేరకు ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్దోషి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంకటరమణకు మద్యం సిండికేట్ నుంచి పది లక్షలు ముడుపులు ముట్టాయనే ఆరోపణపై శాసనసభలో శుక్రవారం సుదీర్ఘమైన చర్చ సాగింది. ఎసిబి విచారణ జరుగుతోందని, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్దోషి అని ముఖ్యమంత్రి క్లీన్ చిట్ ఇచ్చారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఎసిబిని ఆదేశించినట్టు చెప్పారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలులేదు, అదేవిధంగా నిర్దోషులు ఇబ్బంది పడకూడదని అన్నారు. మోపిదేవి వెంకటరమణకు తాను నేరుగా డబ్బులు చెల్లించినట్టు ముద్దాయి రమణ ఎక్కడా చెప్పలేదన్నారు. మోపిదేవి నిర్దోషి అని చెప్పగానే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలకు దిగారు. మంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహంగా 2003లో మద్యం కేసులో ఎసిబి కోర్టు చంద్రబాబును ముద్దాయిగా పేర్కొందని తెలిపారు. ఆరోజు ముద్దాయిగా ఉన్న మీరు రాజీనామా చేయలేదు, కానీ ఈరోజు కనీసం ముద్దాయిగా కూడా లేని మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు మీకు లేదు అని ముఖ్యమంత్రి నిలదీశారు.
2003లో ఎసిబి కేసులో తనను ముఖ్యమంత్రి ముద్దాయి అని పిలవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎసిబి కేసును హైకోర్టు కొట్టివేసిందని, తరువాత సుప్రీం కోర్టులోనూ కొట్టివేశారని సభలో వెల్లడించారు. అయినా ముఖ్యమంత్రి సిగ్గూ లజ్జా లేకుండా తనను ముద్దాయి అంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి ఎక్కడున్నారు.. ఆయనలా మీకూ జైలు శిక్ష తప్పదంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ‘ముద్దాయి అంటున్నారుగా, దమ్ముంటే అరెస్టు చేయండి. సభలో సవాల్ చేస్తున్నా’ అంటూ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి సిగ్గులేకుండా మాట్లడుతున్నారని, ముడుపుల కేసును సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని సైతం కోర్టు విచారణ నుంచి తప్పించుకోలేదని, ముఖ్యమంత్రి పరిస్థితీ అంతేనన్నారు. పోలవరం టెండర్లు రద్దు చేయించామని అంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికే తలవంపులు తెచ్చారని మండిపడ్డారు. మద్యం ముడుపుల వ్యవహారంలో డబ్బు ఇచ్చిన వారిని, తీసుకున్న వారిని అరెస్టు చేసినప్పుడు మంత్రిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
కాగా, ‘ఎక్సైజ్ మంత్రిగా తప్పు చేసినట్టు రుజువైన క్షణంలో పదవినుంచి తప్పుకుంటా. విపక్షం కోరకముందే రాజీనామా పత్రంతో ముఖ్యమంత్రి వద్దకెళ్లి విచారణ జరిపించమని కోరా’ అని ఆబ్కారి మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా తనపై ప్రతిపక్షాలు ప్రధానంగా మూడు ఆరోపణలు చేశాయని మంత్రి వివరించారు. వాటిలో ఒకటి తనకు నున్నా రమణ అనే మద్యం వ్యాపారి పది లక్షలు ముడుపులు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇతరులకు నేరుగా ముడుపులు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ తనకు స్వయంగా ఇచ్చినట్టు రమణ ఎక్కడా చెప్పలేదని, మధ్యవర్తికి ఇచ్చినట్టుగా మాత్రమే చెప్పారని మంత్రి గుర్తు చేశారు. అలాగే కల్తీ మద్యాన్ని నియంత్రించేందుకు మద్యం బ్యాటిళ్ళపై హాలోగ్రామ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించగా, ఏడు కంపెనీలు పోటీ పడగా, చివరగా మూడు కంపెనీల టెండర్లు పరిశీలనకు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. పై మూడింటిలో ఒక కంపెనీకి మద్యం డిస్టిలరీస్‌తో సంబంధం ఉండకూడదనే నిబంధన మేరకు తిరస్కరించామని మంత్రి వివరించారు.
అయితే టెండర్ తిరస్కరించిన కంపెనీ, చీఫ్ జస్టిస్ హోదాలో పని చేసిన జస్టిస్ జీవన్‌రెడ్డి, మరికొందరు న్యాయకోవిదుల నుంచి లేఖ తీసుకొచ్చారని, డిస్టిలరీస్ కంపెనీతో సంబంధం ఉన్నంత మాత్రాన టెండర్ వేయకూడదని ఎక్కడా లేదని వారు తనకు విజ్ఞప్తి చేయగా, పరిశీలించమని మాత్రమే అధికారులకు సూచించానని మంత్రి వివరించారు. తనస్థానంలో ఎవరున్నా పరిశీలించమని అధికారులకు ఎండార్స్ చేస్తారా? లేదా? అని మోపిదేవి ప్రశ్నించారు. ఇక తనపై వచ్చిన మూడవ ఆరోపణ, కుమారుని పేరిట బీరు తయారీ డిస్టిలరీకి అనుమతి పొందినట్టు ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు మాదిరిగా పిల్లలకు మంచి భవిష్యత్ కల్పించాలనే ఉద్దేశంతో నా కుమారుడి పేరుమీద డిస్టిలరీకి అనుమతి పొందడం నూటికి నూరుపాళ్లు వాస్తవం’ అని మంత్రి అంగీకరించారు. అయితే సంబంధిత మంత్రిగా ఉండి కుమారుని పేరు మీద మద్యం తయారీకి అనుమతి పొందడం తప్పని, ఈ విషయంలో తొందర పడ్డానేమోనని ఆలస్యంగా గ్రహించి, దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నానని మంత్రి స్పష్టం చేశారు. రద్దు చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి స్పీకర్‌కు అందించారు.
http://www.teluguone.com/news/content/likkar-sindicates-24-12170.html





