వయసు తగ్గిపోవాలా? డాన్స్ చేయండి!
Publish Date:May 31, 2021
Advertisement
వయసు మీదపడే కొద్దీ మన శరీరంలోని అవయవాలు ఒకొక్కటిగా బలహీనపడిపోతుంటాయి. ఇక మెదడు సంగతి చెప్పనే అక్కర్లేదు. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడకపోగా, పాత కణాలు నశించిపోతుంటాయి. ఫలితంగా మతిమరపు దగ్గర నుంచి అల్జీమర్స్ వరకు నానారకాల సమస్యలు చుట్టుముడతాయి. కానీ నాట్యం చేసేవారిలో ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు పరిశోధకులు. శరీరిక వ్యాయమం వల్ల మన మెదడులోని ‘హిప్పో క్యాంపస్’ అనే భాగం బలపడుతుందని ఎప్పటినుంచో చెబుతున్నారు. మన జ్ఞాపకశక్తిని, నేర్పునీ, నిలకడనీ ఈ హిప్పో క్యాంపస్ ప్రభావితం చేస్తుంది. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల అధిక ప్రయోజం ఉందో తెలుసుకోవాలనుకున్నారు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇందుకోసం 68 ఏళ్ల సగటు వయసు ఉన్న కొందరు వృద్ధులను ఎన్నుకొన్నారు. పరిశోధనలో భాగంగా అభ్యర్థులందరికీ 18 నెలల పాటు శారీరిక వ్యాయామం కలిగించే ప్రణాళికను రూపొందించారు. వీటిలో నడక, సైక్లింగ్‌తో పాటుగా నాట్యం చేయడం కూడా ఉంది. ఊహించినట్లుగా వీరందరిలోనూ ‘హిప్పోక్యాంపస్’ భాగం బలపడింది. కానీ నాట్యం చేసేవారిలో ఈ ఫలితం మరింత స్పష్టంగా కనిపించింది. డాన్స్ చేసేవారు ఏ వారానికి ఆ వారం కొత్త భంగిమలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భంగిమలన్నీ పూర్తయిపోతే, మరో తరహా నృత్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకునేందుకు మెదడు మరింత శక్తిమంతంగా మారిపోతుంది. ఒక పక్క భంగిమలను గుర్తుంచుకోవాలి, మరో పక్క దానికి అనుగుణంగా శరీరంలోని నిలకడని కూడా దారికి తెచ్చుకోవాలి. అంటే శరీరమూ, మెదడూ రెండూ చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కారణంగానే ఇతర వ్యాయామాలతో పోలిస్తే, నాట్యం చేయడం వల్ల మరింత లాభం ఉంటుందని తేలింది. మరెందుకాలస్యం! హిప్‌హాప్ దగ్గర నుంచి కూచిపూడిదాకా ఏదో ఒక నాట్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ వయసుని తగ్గించేసుకోండి.
http://www.teluguone.com/news/content/lifestyle-35-77394.html





