బద్ధకం కూడా ఓ అంటురోగమే!
Publish Date:Apr 21, 2021
Advertisement
తెలివి, బద్ధకం, అసహనం ఇవన్నీ వ్యక్తిగతమైన లక్షణాలని మన నమ్మకం. మనిషికీ మనిషికీ ఈ లక్షణాలలో తేడా ఉంటాయని మన అంచనా! ఇటు మనస్తత్వ శాస్త్రమూ, అటు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాయి. కానీ వీటిలో కొంతవరకు మాత్రమే నిజం ఉందంటున్నారు పరిశోధకులు. తన చుట్టూ ఉండే వ్యక్తులని బట్టి ఈ లక్షణాలు ప్రభావితం అవుతాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. పారిస్ నగరానికి చెందిన కొందరు పరిశోధకులు మన వ్యక్తిగత లక్షణాల మీద ఇతరుల ప్రభావాన్ని తేల్చేందుకు ఓ 56 మంది వ్యక్తులను ఎన్నుకొన్నారు. ఇతరుల ప్రవర్తను గమనించినప్పుడు వీరిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. అటు సైకాలజీనీ, ఇటు గణితాన్నీ ఉపయోగించి వీరి మనస్తత్వంలో వస్తున్న మార్పులను లెక్క కట్టారు. వీరిలో నిర్ణయాలను తీసుకోవడం, శ్రమించడం, పనులు వాయిదా వేయడం... లాంటి స్వభావాలు అవతలివారి ప్రవర్తని బట్టి మారడాన్ని గమనించారు. వ్యక్తిగతం అనుకున్న లక్షణాలు ఇంత బలహీనంగా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. కానీ అందుకు స్పష్టమైన కారణమూ కనిపించింది. మన చుట్టూ ఉండేవారు ఏం చేస్తే అదే నిజం కాబోసు అన్న సందేహం మనలో ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ మనం అతిజాగ్రత్త కలిగిన మనస్తత్వం ఉండీ, అవతలివారు కూడా అదే తరహాలో ఉంటే... అదే సురక్షితమైన మార్గం అని మనసుకి తోస్తుంది. అలా కాకుండా మనం దూకుడుగా ఉండి, మన చుట్టూ ఉండేవారంతా అతిజాగ్రత్త పరులై ఉంటే... మనలో ఏదో లోపం ఉందేమో అనిపించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఎలా చూసినా, మనకి తెలియకుండానే పదిమందితోనూ కలిసి నడిచే ప్రయత్నం చేస్తామన్నమాట! దురదృష్టం ఏమిటంటే మనలో ఈ పక్షపాత ధోరణ ప్రభావితం చేస్తున్నట్లు మనకి కూడా అనుమానం రాదు. అది మన సహజమైన వ్యక్తిత్వమే అన్నంతగా ఇతరుల వల్ల ప్రభావితం అయిపోతాము. అందుకేనేమో పెద్దలు ‘అర్నెళ్లు సావాసం చేస్తే, వారు వీరవుతారు’ అని అంటుంటారు. ఈ విషయాన్ని కాస్త మనసులో ఉంచుకుని పదిమంది దారినీ పక్కన పెట్టి మన విచక్షణకు పదునుపెట్టడం ఎంత అవసరమో కదా! - నిర్జర.
http://www.teluguone.com/news/content/laziness-35-73610.html





