హైకోర్టు లాయర్ దంపతుల మర్డర్ కేసులో బయటకొస్తున్న సంచలన నిజాలు
Publish Date:Feb 17, 2021
Advertisement
తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు ప్రాణహాని ఉందని ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది దంపతులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వామనరావు దంపతుల హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో శీలం రంగయ్య లాకప్ డెత్‌పై వామనరావు, నాగమణి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు వాపస్ తీసుకోవాలని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వామనరావును బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామగుండం సీపీ సత్యనారాయణతో లాయర్ వామనరావు, నాగమణి వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. మరోపక్క పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసులు వాదిస్తున్నారు. హైకోర్టు న్యాయవాది వామనరావు, నాగమణిలను దుండగులు ఈరోజు పట్టపగలే నరికిచంపిన విషయం తెలిసిందే. రామగిరి మండలం కలవచర్ల వద్ద వారు ప్రయాణిస్తున్న కారులోనే కొంత మంది దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి నరికి చంపారు. అయితే చనిపోతూ వామనరావు తన మరణ వాంగ్మూలంలో కుంట శ్రీను తనపై దాడి చేశాడని చెప్పారు.. ప్రస్తుతం కుంట శ్రీను మంథని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గా ఉన్నాడు. ఆరు బృందాలతో కేసు విచారణను పోలీసులు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సత్యనారాయణ ప్రకటించారు. మరోపక్క హైకోర్టు లాయర్ వామన్ రావు దంపతుల హత్యపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సుపారీ హత్యేనని… దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిపిన వామనరావును ఇలా చంపేయటం దారుణమని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, లోతైన విచారణ జరపాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
http://www.teluguone.com/news/content/lawyers-suspect-on-ex-mla-putta-madhu-in-lawyer-vaman-rao-murder-39-110251.html





