దేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు, హత్యలు.. చోద్యం చూస్తున్న పోలీసులు.. పరామర్శకు కూడా నో పర్మిషన్
Publish Date:Jun 4, 2022
Advertisement
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయా? దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తూ.. పోలీసులు విపక్ష నేతలను నిర్బంధిస్తున్నారా. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా అనుమతించకుండా గృహ నిర్బంధాలతో వేధిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందనీ, అధికార పక్షం దాష్టీకాలకూ, దౌర్జన్యాలకూ అంతు లేకుండా పోయిందనీ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులు, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా తెలుగుదేశంనేతలను అనుమతించడం లేదు. రాష్ట్రంలో నియంత రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యం అపహాస్యంపాలౌతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మేం దాడులు చేస్తాం... హత్యలు చేస్తాం.. అయినా సరే విపక్ష నేతలు నిరసనలు చేయడానికి కానీ మృతుని కుటుంబాలను పరామర్శించడానికి కానీ వీలు లేదు అన్నట్లుగానే రాష్ట్రంలో అధికార వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్య బడుతున్నారు. తాజాగా వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన కుంచర్ల జల్లయ్య అంత్రికియలకు హాజరయ్యేందుకు తెలుగుదేశం నేతలెవరూ హాజరు కాకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు శనివారంనరసరావుపేటలో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెర తీశారు. జలయ్య మృతదేహానికి నివాళులర్పించేందుకు బయలు దేరిన మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా నక్కాఆనందబాబు పోలీసుల మధ్య వాగ్వాదంజరిగింది. తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలంటే నక్కా ఆనందబాబు పోలీసులను నిలదీశారు. అక్రమంగా నిర్భంధిస్తే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పినట్లల్లా ఆడితే భవిష్యత్ లో పోలీసులు ఇబ్బందులు పడటం ఖాయమని నక్కా ఆనందబాబు అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై వైసీపీ గూండాలు హత్యలు చేస్తుంటే ఆపలేరు కానీ పరామర్శలకు వెళ్లే తెలుగుదేశం నేతలను నిర్బంధించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, విజయవాడలో బుద్ధా వెంకన్న, తేలుకుంట్లలో యరపతినేని శ్రినివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, పొందుగుల వద్ద మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య ఆ గ్రామాన్ని విడిచిపెట్టి గత మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. బ్యాంకు పని మీద ఆయన దుర్గికి వెళ్లాల్సి ఉండటంతో గురువారం రాత్రి జంగమేశ్వరపాడుకు వచ్చాడు. శుక్రవారం ఉదయమే దుర్గిలోని బ్యాంకుకు వెళుతుండగా దారి కాచి వైసీపీ వర్గీయులు జల్లయ్యపై వేటకొడవళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జల్లయ్యను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మరణించాడు. జల్లయ్య పై దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జల్లయ్య హత్య జరిగిందని, వైసీపీ గూండాలే ఈ దాడికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, పోలీసులు వైసీపీ తొత్తులుగా మారి వారి అరాచకాలకు, దౌర్జన్యాలకూ దన్నుగా నిలుస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.
పల్నాడు జిల్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. తెలుగుదేశం నేతలు జల్లయ్య హత్యను ఖండించారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావు పేట బయలు దేరిన తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/law-and-order-situation-worst-in-ap-25-137005.html





