లాల్ దర్వాజా బోనాలవేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Publish Date:Aug 8, 2026
Advertisement
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా, దర్బార్ మైసమ్మ–కార్వాన్, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపులు ముగిసే వరకు పాత బస్తీలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఇంజిన్ బౌలి, ఆలియాబాద్, లాల్ దర్వాజా, గౌలీపురా, ఛత్రినాక, చార్మినార్, మొఘల్‌పురా, హరిబౌలి తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారిని బోనాల ఊరేగింపు పూర్తయ్యే వరకు పూర్తిగా మూసివేయనున్నారు. చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు TG, APSRTC బస్సులను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. భక్తుల వాహనాల కోసం శాలిబండ, అల్కా థియేటర్, ఆర్యవైశ్య మందిరం, VDP స్కూల్ మైదానం, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టెర్మినల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దర్బార్ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు కార్వాన్, పురానాపూల్, టప్పాచబుత్రా, జియాగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. పురానాపూల్, టప్పాచబుత్రా, యాదవ్ భవన్, మొఘల్ కా నాలా వైపు నుంచి ఆలయం దిశగా వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. కార్వాన్‌లో ప్రభుత్వ పాఠశాల మైదానం, తోలి మసీదు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, జగత్ సింగ్ ప్రైవేట్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో బోనాల నేపథ్యంలో ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ఉప్పల్–చాదర్‌ఘాట్, MGBS మార్గాల్లో భారీ వాహనాలు, బస్సులను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా నడిపించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ GHMC మైదానంలో వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. చిలకల గూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సీతాఫల్‌మండి, చిలకలగూడ, అల్లుగడ్డ బావి, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు, వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. Lal Darwaza Bonalu, old city, Medina X Roads, Sitaphalmandi, Chilakalguda, Allugadda well, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/lal-darwaza-bonalu-36-228432.html





