జగన్ గెలుపు ధీమా పట్ల వైసీపీలోనే కనిపించని విశ్వాసం.!
Publish Date:Jul 7, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదు.. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్.. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే గడిచిపోయాయి, మళ్లీ ఎన్నికలు వస్తాయి, మనమే గెలుస్తాం అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన ఈ రెండేళ్లూ దాదాపుగా కళ్లు మూసుకునే ఉన్నారు. మరో మూడేళ్లు ఇలా గడిపేస్తే.. ఎన్నికలు వస్తాయి విజయం సాధించేస్తామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెబుతున్నారు. మధ్యమధ్యలో మావిగన్ వంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మనపని మనం చేసేస్తున్నాం అని తన జబ్బలు తానే చరిచేసుకుని.. గెలుపు కలలు కంటున్నారు. అంతా బానే ఉంది కానీ తమ పార్టీ అధినేత గెలుపు ధీమా పై వైపీపీ నేతలలో కానీ, క్యాడర్ లో కానీ ఇసుమంతైనా విశ్వాసం కలగడం లేదు. పార్టీ అధినేత తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో విజయంపై ఆశలు వదిలేసుకోవలసిందేనన్న చర్య వైసీపీ నేతలలో జోరుగా జరుగుతోంది. మావిగన్ వంటి ప్రతిపాదనల వల్ల మరింతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వీటిని వేటినీ ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు కూడా.. వచ్చే ఎన్నికలలో జగన్ విజయం అంత వీజీ కాదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో విజయం కోసం కూడావ్యూహం ప్రకారం ముందుకు సాగుతోందంటున్నారు.ఆ వ్యూహమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూటమికి మరోసారి అధికార పగ్గాలు అప్పగిస్తాయని అంటున్నారు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్.. ఐదేళ్లలో ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తే తనను గెలిపిస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సర్వే (సర్) జరుగుతోంది. తద్వారా దొంగ ఓట్లు తొలగిపోనున్నాయి ఈ విషయంలో వైసీపీ ఆందోళన ఆ పార్టీ గతంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించిందన్న అభిప్రాయాన్ని జనబాహుల్యంలో కలిగిస్తోంది. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి అజెండా ప్రభుత్వంపై సానుకూలతకు దోహదం చేస్తున్నదనీ, రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తుండటంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం.. కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతకు దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయం కూటమిని మరింత బలోపేతం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. తలెత్తినా వాటిని ఎక్కడికక్కడే సద్దుమణిగించేలా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తుండటం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కలిసివస్తోంది. ఈ నేపథ్యంలో వారాంతపు ప్రెస్ మీట్లకే పరిమితమౌతున్న జగన్ తీరు వల్ల వైసీపీకి రాజకీయంగా కోలుకోలేనంతగా నష్టం వాటిల్లుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధినేతే రాష్ట్రాలనికి వారంలో ఓసారి చుట్టపు చూపుగా వస్తూ, పార్ట్ టైమ్ పాలిటిక్స్ కు పరిమితమౌతుండటంతో వైసీపీ నేతలూ, కార్యకర్తలూ కూడా సైలెంటైపోయారని పరిశీలకులు అంటున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వైసీపీ కనిపించడం లేదని చెబుతున్నారు. AP Politics, NDA Alliance AP, Voter Survey AP, YSRCP Fear, Andhra Pradesh Elections
http://www.teluguone.com/news/content/lack-of-winning--confidence-in-ycp-45-225254.html




