కాంగ్రెస్, వైసీపీకి కేవీపీ గండం!
Publish Date:Apr 3, 2014
Advertisement
ఎన్నికల వేళ అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ గండం వచ్చి పడింది. ఆ గండం పేరు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన ‘ఆత్మ’గా పేరుపొందిన కేవీపీ ఎన్నో ముడుపుల భాగోతాలు నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. అమెరికాకి చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ కేవీపీ నడిపిన ఒక ముడుపుల భాగోతాన్ని బయట పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో వున్న టైటానియం ఖనిజాన్ని తవ్వుకోవడానికి అనుమతి కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ, ఉక్రెయిన్‌కి చెందిన డీఎఫ్ సంస్థ కేవీపీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మొత్తం 111 కోట్లు ముడుపులుగా చెల్లించాయని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. సదరు రెండు సంస్థలతోపాటు కేవీపీ, మరో ఆరుగురి మీద కేసులు నమోదు చేసింది. ఈ ఆరుగురి నుంచి 64 కోట్ల రూపాయల జరిమానాని విధించాలని ఎఫ్‌బీఐ షికాగో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. త్వరలో దీనికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం వుంది. అప్పుడు కేవీపీతోపాటు ఆయన వెనుక వున్న ‘ముఖ్యులు’ బయటపడతారు.
కేవీపీ ఆత్మ అయితే, ఆయన అంతరాత్మ వైఎస్ రాజశేఖరరెడ్డి. వీళ్ళిద్దరూ ఈ కేసు ద్వారా బద్నామ్ అయితే అటు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా నష్టపోయే అవకాశం వుంది. ఈ కేసును దర్యాప్తు చేసేది మన సీబీఐ అయితే కేసు ఎప్పటికి తేలేనులే అనుకోవచ్చు. ఎఫ్‌బీఐ అంటే ఆషామాషీ సంస్థ కాదు. మెరుపు వేగంతో దర్యాప్తు చేసి కుంభకోణానికి కారకులైన వారి ఆట కట్టించే వరకూ వదిలిపెట్టదు. అందుకే కాంగ్రెస్, వైకాపా గుండెలు అదిరిపోతున్నాయి.
http://www.teluguone.com/news/content/kvp-among-six-charged-in-us-corruption-case-45-31929.html





