నోరు జారి జగన్ కేసులో ఇర్రుకొన్న కేంద్ర మంత్రి
Publish Date:Apr 30, 2013
Advertisement
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కాంగ్రెస్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్యన ఉన్న ఒక అస్పష్టమయిన సన్నటి గీతను కూడా చేరిపివేస్తోంది. అతని కేసులతో విడదీయలేనంతగా ముడిపడిపోయిన మంత్రులు తమ తప్పులను ఒప్పుకొనలేక, వాటి నుండి తప్పుకొనలేక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వంలో బాద్యతగల మంత్రులుగా వారు తీసుకొన్న నిర్ణయాలకు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని ఏవిధంగా బాధ్యుని చేస్తారంటూ జగన్ తరపు లాయర్లు వేస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సరయిన సమాధానం లేకపోవడంతో, వారు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైపు చూ(పి)స్తున్నారు. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఉలికులికిపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన పార్టీని బౌతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయసాగారు. కొందరు అతనినిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు అతను శాశ్వితంగా జైలలోనే ఉండిపోతాడని జోస్యం చెప్పుతున్నారు. ఆ ఊపులోనే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు. కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొని, మొన్న సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషను మీద వాదనలు జరుగుతున్నప్పుడు కోర్టులో బయటపెట్టి, “జగన్ మోహన్ రెడ్డి అరెస్టులో తమకి ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరిప్పుడు అతను పార్టీలో చేరితే జైలు నుండి బయటపడతాడని ఏవిధంగా హామీ ఇస్తోంది? అంటే జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర చేస్తే దానికి సీబీఐ పరోక్షంగా సహకరిస్తోందని భావించాలా? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకొంటే సీబీఐ అతని మీద పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోతాయా?” అని ప్రశ్నించేసరికి సీబీఐ వద్ద చెప్పేందుకు సమాధానం లేదు. ఒక పక్క తాము జగన్ మోహన్ రెడ్డి కేసులలో నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిళ్ళు లేకుండా దర్యాప్తు జరుపుతున్నామని, తమది స్వతంత్ర సంస్థ అని సీబీఐ పదేపదే ప్రకటించుకొంటుంటే మరో వైపు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అతను కేసుల నుండి, జైలు నుండి విడుదల హామీలు గుప్పించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. ఇక చేసేదేమీ లేక ఆవిధంగా హామీ ఇచ్చిన సదరు మంత్రి గారికి కూడా సమన్లు జారీ చేసి, ఆయన ఏవిధంగా జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విడిపిస్తారో తెలుసుకోవాలనుకొంటున్నట్లు కోర్టుకు విన్నవించుకొని బయట పడింది. ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలందరి నోళ్ళు మూతపడే అవకాశం ఉంది. లేకుంటే వారు కూడా కోట్ల లాగే కోర్టు మెట్లక్కక తప్పదు.
http://www.teluguone.com/news/content/kotla-surya-prakash-reddy-39-22782.html