వైసీపీచేయాల్సింది నిరసన దీక్షలు కాదు ప్రాయశ్చిత్త దీక్షలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.!
Publish Date:Aug 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఐదేళ్ల హయాంలో చేసిన అక్రమాలు, అవకతవకలకు, ఆర్థిక అరాచకత్వానికీ ఆ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినందుకు ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలన్నారు. చేసుకోవాలని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వనాశనం చేసిందని కోటంరెడ్డి విమర్శించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిలో పెడుతోందన్న కోటంరెడ్డి.. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం, పరిశ్రమల రాకతో లక్షలాది ఉద్యోగాల సృష్టి జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఒక్క సంతకంతో వేలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, వైకాపా నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేకాటలో గెలిచిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. పేకాట ఆడిన ఒక్కరికైనా టీచర్ ఉద్యోగం ఇచ్చినట్లు రుజువు చేస్తే, గంటలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు. గతంలో తనపై బెదిరింపులకు దిగిన బోరుగడ్డ అనిల్ కుమార్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనను ఫోన్లో తీవ్రంగా బెదిరించిన వ్యక్తి, ఆ తర్వాత దేవుడి స్క్రిప్ట్, ప్రకృతి దెబ్బతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. వైకాపా నాయకులు కార్యకర్తలను, నేతలను కేవలం వాడుకుని వదిలేస్తారనే దానికి బోరుగడ్డ అనిలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. మాట్లాడేటప్పుడు నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని హితవు పలికారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరణ వంటి అనేక ప్రజానుకూల చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే వైసీపీ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలు వైపీపీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే యత్నాలు ఎప్పటికీ సాగవని హెచ్చరించారు. ప్రతిపక్షం ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రాయశ్చిత్త దీక్షలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. Kotamreddy Sridhar Reddy, YSRCP atonement protests, Nara Lokesh's Mega DSC, Borugadda Anil Kumar, AP Alliance government
http://www.teluguone.com/news/content/kotamreddy-sridhar-reddy-39-228394.html





