కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం : కొండా మురళి
Publish Date:Aug 26, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. ఇటీవల తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆమె కేవలం 'ప్లాన్-ఎ' ప్రకారమే మాట్లాడిందని, అసలు ఆమె మనసులో ఉన్న 'ప్లాన్-బి' ఏంటో తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాలపై మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. మంగళవారం జరిగిన వనమహోత్సవంతో పాటు బుధవారం నిర్వహించిన ఇతర అధికారిక సమావేశాల్లోనూ సురేఖ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఉన్న అంశాలపై తాను స్పందించబోనని మురళి తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం వెలువరించేంత వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగానే ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ వైఖరిపై పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ముందుకు కూడా ఈ అంశం వెళ్లడంతో అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ భేటీలు, సీనియర్ నేతల సంప్రదింపుల నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపించాయి. అధిష్టానం నిర్ణయం ఆధారంగా తదుపరి రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది.
Konda Murali, Konda Surekha, Telangana Congress News, Deputy cm Bhatti Vikramarka,TeluguOne News, CM Revanth reddy, Congress party, Minister Uttam Kumar Reddy, MLA Komatireddy Rajagopal Reddy
http://www.teluguone.com/news/content/konda-murali-25-229926.html





