పెద్ద నేత వల్లే 3 వేల ఓట్లు.. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్లు
Publish Date:Nov 6, 2021
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ హుజురాబాద్ మంటలు చల్లారడం లేదు. పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకపోవడంపై కొందరు నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా కామెంట్లు చేస్తున్నారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయంపై స్పందించిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా సాధించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పెద్ద పెద్ద నాయకులున్నారని, నేను పెద్ద నాయకుడిని కాదని అందుకే హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదని అన్నారు.బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 6 వేల ఓట్లు వస్తే హుజురాబాద్‌లో కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. తెలంగాణలో కంటే ప్రస్తుతం ఏపీలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నట్లుగా కోమటిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే మా నాయకులన్నారు ఎంపీ కోమటిరెడ్డి. సోనియా గాంధీ మాకు దేవతలాంటిది.. కానీ, పార్టీలో ఉన్న కొందరు దెయ్యం అని అన్నారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం సీఎల్పీకి వచ్చారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రాణమైనా ఇచ్చే నాయకుడు వీహెచ్ అన్నారు. ఆయన అంటే మొదటి నుంచి అభిమానం ఉందని చెప్పారు.
http://www.teluguone.com/news/content/komatireddy-venkat-reddy-target-revanth-reddy-over-huzurabad-defeat-39-125920.html





