అసెంబ్లీకి వెళ్లుటయా.. మానుటయా.. కింకర్తవ్యం?.. కేసీఆర్ మథనం!?
Publish Date:Aug 6, 2025
Advertisement
అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగిందొక విద్యార్థికి.. అంటారు మహాకవి శ్రీశ్రీ తన సంధ్యా సమస్యలు కవితలో.. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎటూ తేల్చుకోలేని సమస్యతో మథనపడుతున్నారు. ఔను ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు సమస్యే ఏదురైంది. అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్నది తేల్చుకోలేక తీవ్రంగా మథన పడుతున్నారంటున్నారు పరిశీలకులు. అసలు అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్న సంశయంతో కేసీఆర్ మథనపడటమేంటి? అసలాయన గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత రెండు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లిందే లేదుగా అనుకుంటున్నారా? అ విషయానికి వద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావుకు గొప్ప చిక్కే వచ్చి పడింది. పార్టీ పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ హాజరవ్వాలా వద్దా అన్న మీమాంశ ఎందుకంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగిందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపైనా తెలంగాణ అసెంబ్లీ చర్చించబోతోంది. అయితే ఆ నివేదిక అంతా బూటకమని మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ నిపుణులు డిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి ఆ మూడు చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తేదానిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికనున కాంగ్రెస్ నివేదిక అంటున్నారు. అయితే ఈ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరై నివేదికను ఎండగడతారని చెబుతున్నారు. ఇక్కడే కేసీఆర్ కు చిక్కు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్.. ఇప్పుడు సమావేశాలకు హాజరై తనను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి రెడీ అయిపోవడం, ఒక వేళ నివేదిక ఆధారంగా తనపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు వరకూ వెళ్లైనా న్యాయం కోసం పోరాడతాం అనడంపై పరిశీలకులే కాదు, సామాన్య ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. ఇంతకాలం ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు కాళేశ్వరం కేసు తన మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో తగుదునమ్మా అని అసెంబ్లీకి హాజరై తనను తాను సమర్ధించుకుంటూ గళమెత్తితే ప్రజలకు ఏం సంకేతమించినట్లు అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగా, ఒక ఎమెల్యేగా ఈ ఏడాదిన్నర కాలం కేసీఆర్ ప్రజాసమస్యలపై గళమెత్తి, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించి ఉంటే.. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తనను తాను సమర్ధించుకొనే విషయంలో జనం నుంచి ఎటువంటి అభ్యంతరాలూ వచ్చి ఉండేవి కావు. కానీ అలా చేయకుండా కేవలం తన సమస్యే రాష్ట్ర సమస్య అన్నట్లు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్నీ, కమిషన్ నివేదికనూ సభ వేదికగా ఎండగడతానంటే జనం తనను స్వార్థపరుడిగా భావిస్తారన్న సంశయం కేసీఆర్ ను వేధిస్తున్నదంటున్నారు. అలాగని కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకూ డుమ్మా కొడితే.. తన హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక భయపడి ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న నిందను మోయాల్సి వస్తుందన్న భావనా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఎంచేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచక ఆందోళనకు గురౌతున్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.
http://www.teluguone.com/news/content/kcr-in-dilemma-weather-attend-assembly-or-not-39-203624.html





