వైసీపీని చూసి కేసీఆర్ హైరానా?.. కేబినెట్ విస్తరణపై డైలమా!
Publish Date:Apr 12, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదిగో అదిగో అంటూ ఆరు నెలలు సాగదీసి చివరాఖరుకు,మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణనుమార్పులు చేర్పులతో సరిపెట్టేశారు. నిజానికి, మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి చేసిన దానికీ, పొంతన, పోలిక లేదు. అనుకున్నది అందరినీ మర్చాలని, కానీ, చివరకు కొత్త మంత్రివర్గంలోనూ11 మంది పాత మంత్రులను తీసుకోక తప్పలేదు. అదొకటి అలా ఉంటే మంత్రివర్గంలో చేసిన మార్పులు అధికార పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.ఒక విధంగా చూస్తే,మంత్రివర్గ విస్తరణ తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పార్టీ మీద పట్టు పట్టుకోల్పోయారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ కంటే ముందు నుంచే మంత్రివర్గ విస్తరణ మాట వినిపిస్తున్న, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, అదే తప్పు చేస్తారా? అనే ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. నిజానికి, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ (శాసన మండలి) ఎన్నికలకు ముందు నుంచి రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణల మధ్య సమతుల్యంకోసం ఈటల స్థానంలో మంత్రి పదవి ఇచ్చేందుకే అదే సామజిక వర్గానికి చెందినా రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ను రాజీనామా చేయించి మరీ మండలికి తీసుకొచ్చారు.అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతో పాటుగా మరికొందరు మండలి సభ్యులను కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారనే ప్రచారం చాలా జోరుగా సాగింది.ఒక దశలో సంక్రాంతికే కొత్త కేబినెట్ వస్తుందని చెప్పుకున్నారు. సంక్రాంతి, దసరా శ్రీరామ నవమి ఇలా రావలసిన పండగలు అన్నీ వచ్చి పోయాయి, కానీ, అసలు ‘పండగ’ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఏపీలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే కేసీఆర్, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జోలికి వెళతారా? అంటే వెళ్ళరనే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తేనెతుట్టెను కదిల్చే సాహాసం చేయరనే పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగక ముందు నుంచే పార్టీలో పక్క చూపులు మొదలయ్యాయి. తెరాస ఉగాది పంచాగంలోనూ ఆ ప్రస్తావన చేయడంతో పక్కచూపులపై అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు, కీలక నేతలు కారు దిగి కమలం కూటికి చేరారు. మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం తెరాసను గద్దెదించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎంతవరకు నిజమో ఏమో కానీ, బీజేపీ రాష్ట్ర నాయకులు, త్వరలోనే చాలా పెద్ద సంఖ్యలో తెరాస నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మే నెలలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా తెరాస నుంచి చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ నుంఛి తెరాసలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆపార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతను ప్రస్తుతం తెరాసలో ఉన్న మాజీ కాంగ్రెస్ సీనియర్ నేతకు అప్పగించి నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలోచన చేయరని అంటున్నారు. అయితే, రానున్న కొద్ది రోజుల్లో, ఒకరిద్దరిని గుట్టుచప్పుడు కాకుండా మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చని, ఆ ఒకరిద్దరిలో కవిత ఖాయంగా ఉంటారని అంటున్నారు. అదీగాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారనే ప్రచారం జరుగతున్న ననేపధ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉండక పోవచ్చని మరోవాదన వినిపిస్తోంది.ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణకు పోవడం అంటే, అదొక ఒక విధంగా ఉన్న సమస్యలకు అదనంగా కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుందని అంటున్నారు. అయితే, అదే సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి మకాం మార్చే సంకేతాలు స్పష్టమవుతున్న నేపధ్యంలో, కేటీఆర్’కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పిస్తారా? లేక సాహసించి ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సో..ఏపీ మంత్రివర్గంలో జరిగిన మార్పులు చేర్పులు సృష్టించిన రాజకీయ దుమారం నేపధ్యంలో, తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులఫై ఊహాగానాలు అయితే, వినిపిస్తున్నాయి, కానీ, అలాంటిదేమీ ఉండదని, ప్రస్తుత మంత్రి వర్గమే ఎన్నికల వరకు కొనసాగుతుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇక చివరకు ఏమి జరుగుతుంది అనేది ఊహాకు అందే విషయం కాకపోయినా, సమీప భవిష్యత్’లో ఎలాంటి మార్పులు ఉండవనే, విశ్లేషకులు బావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-dailamo-in-cabinet-reshuffle-39-134286.html





