తెరాసా చేతిలో చిక్కుకొన్న తెదేపా
Publish Date:Jun 15, 2013
Advertisement
నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు తమపై దాడిచేయడం శోచనీయమని తెదేపా తెలంగాణా ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసను విమర్శించారు. అందువల్ల తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈరోజు బంద్ లో పాల్గొనకుండా కేవలం నిరసనలు తెలిపి సరిపెట్టుకొంటున్నాయి. ఈ రెండు కార్యక్రమాల ద్వారా తెరాస తెలంగాణా ఉద్యమాలపై పూర్తి పేటెంట్ హక్కులు తమదేనని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తుంటే, దానికి సహకరించిన మిగిలిన పార్టీలు తెరాస తమనందరిని పూర్తిగా వాడుకొన్న తరువాత తెలంగాణా అంశాన్ని హైజాక్ చేస్తోందని, ఈ రోజు తెరాస తమను సంప్రదించకుండా తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలుపునివ్వడమే ఉదాహరణ అని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే తెరాస మాత్రం ఇవేవి పట్టించుకొనే స్థితిలో లేదు. నిన్నజరిగిన ఛలోఅసెంబ్లీ ఆందోళన కార్యక్రమానికి తాము ఊహించిన దానికంటే మంచి స్పందన రావడంతో అదే ఊపులో ఈ రోజు తెలంగాణా బంద్ కు కూడా పిలుపునిచ్చి ఈ రెండు కార్యక్రమాల పూర్తి క్రెడిట్ దక్కించుకొని రానున్న స్థానిక ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తోంది.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన పార్టీలు కూడా తెలంగాణా అంశంపై ఎంతో కొంత క్రెడిట్ పొందాలని ఆశించడం సహజమే. కానీ ఆ క్రెడిట్ మొత్తం తెరాస తన్నుకొనిపోవడంతో అవిప్పుడు పశ్చాత్తాపడుతున్నాయి. ఇంత కాలం తెలంగాణా విషయంలో కొంచెం సందిగ్ధ స్థితిలో ఉన్నతెదేపా.
ఎన్నికలు దగ్గరపడుతున్నందున మొట్ట మొదటిసారిగా తెరాస-తెలంగాణా జేఎసీల అధ్వర్యంలోజరిగిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంది. తన తొలి ప్రయత్నంలోనే ఎదురయిన ఈ చేదు అనుభవాన్ని తెదేపా జీర్ణించుకోలేకపోతోంది. అయితే, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనకపోతే తెరాస తమపై తెలంగాణా వ్యతిరేఖముద్ర వేసి రానున్న ఎన్నికలలో తెలంగాణాలో తమ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని తెదేపా భయం. అలాగని తెరాసతో కలిసి ఇటువంటి ఆందోళనలలో పాల్గొనలేని పరిస్థితి. ఒక విధంగా తెరాస, తెదేపాతో సహా మిగిలిన అన్ని పార్టీలని కూడా తనను అనుసరించడమే తప్ప వ్యతిరేఖించలేని నిస్సహాయ పరిస్థితి కల్పించిందని చెప్పవచ్చును. తెలంగాణా అంశంపై రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా తమతమ రాజకీయ ప్రయోజనాలకోసం తప్పనిసరి పరిస్థితిలో తెరాసను తట్టుకొనేందుకు ఆ పార్టీ వెనుకే నడవక తప్పట్లేదు. అందువల్ల అంతిమంగా తెరాసకే రాజకీయ ప్రయోజనం కలుగుటింది తప్ప మిగిలిన పార్టీలు ఎటువంటి ప్రయోజనమూ పొందలేవు.
http://www.teluguone.com/news/content/kcr-chandrababu-37-23559.html