ఏ ఎండాకా గొడుగు పట్టాలి మరి
Publish Date:Jun 29, 2013
Advertisement
మంత్రి పదవి ఇవ్వనంత వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తిపోసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వర్ణించి, కొల్లేరు సమస్య పట్టుకొని కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తానని బెదిరించి, సమైక్యాంధ్ర కోసం అవసరమయితే ఒక కొత్త పార్టీ పెట్టయినా కాంగ్రెస్ భరతం పడతానని ప్రగల్భాలు పోయిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు, ఇప్పుడు తను కోరుకొన్నట్లుగానే కేంద్రంలో మంత్రి పదవి దక్కగానే, స్వరం మార్చి కొత్త పల్లవి అందుకొన్నారు. నిన్న డిల్లీ నుండి హైదరాబాదుకి తిరిగి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ విషయంలో రాజీ పడక తప్పదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పైగా జీవితమంటేనే అనేక రాజీలు పడటం అని, అందులో ఇదీ ఒకటని మెట్ట వేదాంతం కూడా జోడించారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయంలో తేడా లేదని, తన అభిప్రాయలు అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసానని, కానీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు." ఒకవైపు కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతూనే మరో వైపు మంత్రి పదవుల కోసం కక్కుర్తిపడి తానూ మాట మార్చే వ్యక్తిని కాదని చెప్పడం విశేషం. తెలంగాణ విషయంలో రాజీ ధోరణి అంటే దాని అర్ధం తెలంగాణకు అనుకూలమని కాదని వివరించారు. కేంద్ర మంత్రిగా ఉన్న తను ఇప్పుడు సమైక్య సమావేశాలు, సభలకు హాజరుకాకపోవచ్చునని కూడా చెప్పారు. తానెన్నడూ కొత్త పార్టీ పెడతానని అనలేదని, అదంతా మీడియా ఊహాగానాలేనని” ఆయన అన్నారు. కావూరి తన రాజకీయ అనుభవం అంతా రంగరించి తికమక సమాధానాలు చెప్పి అటు తెలంగాణా, ఇటు సమైక్యాంధ్ర నేతలని ఇద్దరినీ మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఆయన మాటల ప్రకారం చూస్తే, ఆయన తెలంగాణా ఏర్పాటుని స్పష్టంగా వ్యతిరేఖిస్తున్నారని అర్ధం అవుతోంది. కానీ, కేంద్ర మంత్రి పదవి దక్కినందువల్ల, అధిష్టానానికి విభజనపై తన అభ్యంతరాలు చెప్పి, అంతిమ నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానికే వదిలేసినట్లు అర్ధం అవుతోంది.
http://www.teluguone.com/news/content/kavuri-sambhasiva-rao-39-23938.html