ఈ అరెస్టులు రాజకీయ వేధింపులేనా?
Publish Date:Mar 1, 2018
Advertisement
ఇప్పటికే మోడీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అనేక విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను మోడీ టార్గెట్ చేస్తున్నారని, పాత కేసులను తిరగదోడి వ్యవహారాన్ని అరెస్టుల వరకూ తీసుకెళ్తున్నారని విమర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పేరున్న లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో పలువురు ఛోటా మోటా నాయకులు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుపాలయ్యారు. అంతకు ముందు వరకూ నత్త నడక నడుస్తూ వచ్చిన కేసులు మోడీ ప్రధాని అయిన తర్వాత వేగం పుంజుకుని సదరు నిందితులకు జైలుమార్గాన్ని చూపించాయి. మోడీ ప్రభుత్వం పుణ్యమా అని తాజాగా మరో అరెస్టు జరిగింది. అరెస్టయింది మరెవరో కాదు.. కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకునే విషయంలో అనుమతులు సరిగా తీసుకోలేదనేది ఆయన మీద నమోదైన కేసు. ఇంతకాలం లండన్‌లో వున్న ఆయన బుధవారం నాడు చెన్నైకి తిరిగి రాగానే పోలీసులు ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. కేవలం ఆరెస్టుతో ఆగలేదు... కార్తీ చిదంబరానికి 14 రోజులపాటు రిమాండ్ విధించాలని కూడా పోలీసులు న్యాయమూర్తిని కోరారు. అయితే న్యాయమూర్తి మాత్రం అందుకు అంగీకరించలేదు. కేవలం ఒక్కరోజు మాత్రమే రిమాండ్ విధించారు. ఇలా కక్షకట్టినట్టుగా 14 రోజుల రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం చక్రం తిప్పిన చిదంబరాన్ని టార్గెట్ చేసిన మోడీ ఇప్పుడిలా ఒక పసలేని కేసును అడ్డం పెట్టుకుని అరెస్టులతో వేధిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అరెస్టుల ద్వారా ప్రతిపక్ష నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, రాజకీయంగా లాభం పొందే ఉద్దేశంతోనే మోడీ ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నా్రని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/karti-chidambaram-arrest-39-80457.html





