దేశం గూటికి కన్నా.. సత్తెన పల్లి నుంచి బరిలోకి!
Publish Date:Jan 6, 2023
Advertisement
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుగువన్ గత ఏడాది అక్టోబర్ లోనే అంటే మూడు నెలల ముందే వెల్లడించింది. అప్పట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో కుండబద్దలు కొట్టారు. ఏపీ బీజేపీలో సమస్య అంతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోనే అని చెప్పారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లోనే విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు. అప్పట్లో కన్నా వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం ఆయనపై చర్యలకు సిద్ధమైందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగిందని అంతా భావించారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కావడం, ఆ తరువాత రాష్ట్ర బీజేపీ వైఖరిలో ఒకింత మార్పు కనబడటంతో బీజేపీలో ముసలం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే ఏపీ బీజేపీలో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయనీ, లోలోన రాజుకుంటూనే ఉన్నాయనీ ఇటీవలి పరిణామాలు తేల్చేశాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించడంతో రాష్ట్ర బీజేపీలో కన్నాను ఏకాకిని చేయడమే లక్ష్యంగా సోము వీర్రాజు పావులు కదుపుతున్నారన్నవిషయం స్ఫష్టమైంది. ఈ నేపథ్యంలోనే కన్నా మరోసారి తన అసమ్మతి గళం విప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడి ఏ పార్టీలోకి చేరుతారన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఇటీవల పవన్ కల్యాణ్ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన జనసేన గూటికి చేరుతారని అంతా భావించారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కన్నా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మూడు నెలల కిందటే తెలుగువన్ చెప్పింది. అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న కన్నా ఆ పార్టీలోనే చేరుతారని పేర్కొంది. సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అప్పట్లోనే తెలుగుదేశం అధినేతను కన్నా కోరారు. అందుకు తెలుగుదేశం అధినేత ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అదీ కాకుండా దాదాపుగా తెలుగుదేశం, జనసేనల మధ్య దాదాపుగా పొత్తు కుదిరిందనీ, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు కూడా వచ్చాయనీ వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన సత్తెనపల్లిని కోరుతున్నప్పటికీ.. కన్నా తెలుగుదేశం తరఫుర ఆ స్థానం నుంచి పోటీలో దిగితే జనసేన ఆ స్థానాన్ని వదులుకోవడానికి అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kanna-to-join-tdp-and-contest-from-sattenapalli-39-149629.html





