కవిత యాత్ర షురూ!
Publish Date:Oct 15, 2025
Advertisement
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ పెడతారా? పెట్టరా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఇంతకీ ఆ యాత్ర ఎలా జరగనుంది? ఆ డీటైల్స్ ఏంటని చూస్తే.. కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించదంటున్నారు. ఇందుకోసం ఆమె తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో ఒక పోస్టర్ ను తీసుకువచ్చి.. దానినే ప్రముఖంగా తన యాత్రద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఎందుకు? అంటే.. తండ్రి కేసీఆర్ తన అన్న కేటీఆర్ తో ఉన్నారు. ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు. దీనిని మార్చడం అసాధ్యం. అందుకే ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను సైతం వద్దనుకునేలా ఆమె అడగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందు కోసమే పార్టీ నుంచి భౌతికంగా బయటకు వచ్చేయడంతో ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగి.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉంది అని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు. నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంటు పండించడంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే యాత్ర సెంటిమెంటు అందరికీ వర్తిస్తుందని కాదు. ఇక్కడా షరతులు వర్తిస్తాయ్. ఇంత వరకూ కేవలం అన్నలకే ఈ సెంటిమెంటు వర్కవుట్ అయ్యింది. చెల్లెళ్లకు కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. జగన్, షర్మిళ ఇద్దరూ యాత్రలు చేశారు. కానీ అధికారం జగన్ కే దక్కింది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-ready-for-yatra-39-207976.html





