కాళేశ్వరం నివేదికను శాసన సభలో ప్రవేశపెడతాం : రేవంత్‌రెడ్డి
Publish Date:Aug 4, 2025
Advertisement
కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక భవిష్యత్తు కార్యాచరణతో పాటు కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం తెలిపారు. ఎవరిపైనా కక్ష సాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే అన్ని వివరాలనూ మీడియా ముందు ఉంచామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్, డిజైనింగ్ అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్ అంచనాలు పెంచి నిర్మించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్‌లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్ దగ్గర లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నీళ్లు కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయే ప్రమాదంలో పడింది. డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అవకతవకలు అన్నింటికీ బాధ్యుడు, జవాబుదారీ అప్పటి సీఎం కేసీఆరే అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలకు కాకుండా సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారని డిప్యూటీ సీఎం ఆరొపించారు
http://www.teluguone.com/news/content/kaleshwaram-commission-39-203499.html





