ప్రాణభయంతో ఎస్ఐ పరుగులు..
Publish Date:Feb 17, 2021
Advertisement
చిన్నపుడు దొంగ పోలీస్ ఆట ఆడితే దొంగ తప్పు చేస్తాడు కాబట్టి దాక్కునే వాడు. పోలీస్ దొంగను పట్టుకునే వాడు. కానీ ఎక్కడ అంతా రివర్స్ పోలీసులే దాక్కుంటున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఖద్దరు బలంతో ఖాకీలనే తరుముతున్నారు. కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని మాలేపాడు పంచాయతీ ఎన్నికల్లో, వైసీపీ మద్దతుతో సుబ్బారెడ్డి, రెబల్ అభ్యర్థిగా పరమేశ్వర్‌రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి మోహన్‌రెడ్డి, మరొకరు పోటీలో ఉన్నారు. వైసీపీ రెబల్ అభ్యర్థులు పోస్టర్స్ అంటిస్తుండగా ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రమోహన్‌రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి, ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతుండగా, అందులో ఇకను దురుసుగా ప్రవర్తించగా ఆ వ్యక్తి పై ఎస్ఐ చేయి చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు డ్యూటీలో ఉన్న ఎస్ఐ పైన దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ఎస్ఐని కొంతదూరం వెంబడించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఎస్‌ఐ ఓ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని, రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,సీఐ సదాశివయ్య గ్రామానికి వెళ్లి వైసీపీ శ్రేణులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో వివాదం తలెత్తిన మాట నిజమేనని, ఎస్‌ఐపై ఎవరూ దౌర్జన్యానికి దిగలేదని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. ఇది ఇలా ఉండగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం, పులికొండలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులు పత్తికొండకు తరలించారు. దీంతో పులికొండ గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
http://www.teluguone.com/news/content/kadapa-ycp-party-leaders-attack-on-si-chandramohan-reddy--39-110261.html





