షర్మిలకే జై కొట్టిన కడప ఓటరు
Publish Date:May 15, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత రెండు ఎన్నికలలో అంటే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన కడపలో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి భారీగా గండి పడింది. గత రెండు ఎన్నికలలో కూడా షర్మిల వైసీపీ విజయం కోసం శ్రమించారు. ప్రచారం చేశారు. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ కుటుంబం ఏకతాటిపై నిలిచి వైసీపీకి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ కుటుంబం మొత్తం షర్మిల వెనుక నిలబడింది. వీటన్నిటి కంటే ప్రధానంగా చెప్పుకోవలసింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ అన్న జగన్ పై వార్ ప్రకటించిన షర్మిలకు, వివేకా కుమార్తె డాక్టర్ సునీత అండగా నిలిచారు. దీంతో కడప లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. షర్మిల విమర్శలు, ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరై.. వాటిని అడ్డుకునేందుకు కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో షర్మిల సెంటిమెంట్ ను ఆశ్రయించారు. వైఎస్ బిడ్డను కొంగుచాచి అడుతున్నా అంటే ఓటర్లకు చేసిన అభ్యర్థన కడప వాసుల హృదయాలను నేరుగా తాకిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని అర్థం చేసుకున్న జగన్ చెల్లెలి చీర రంగును సైతం కామెంట్ చేస్తూ షర్మిల తెలుగుదేశం పలుకులు పలుకుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కడపలో వైసీపీకి తీరని నష్టం చేకూర్చాయి. పార్టీలకు అతీతంగా షర్మిలకు మద్దతు వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నియోజవర్గంలో పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పరిశీలకులు కడప ఓటర్లు షర్మిలకే జై కొట్టారని విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ఓట్లు లోక్ సభ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు, అసెంబ్లీ స్థానం వరకూ సొంత పార్టీకీ పడ్డాయని అంటున్నారు. అదే వాస్తవమైతే కడపలో షర్మిల విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kadapa-voter-favours-sharmila-25-176081.html