కే.ఏ.పాల్ ప్రొడక్షన్స్ ‘గోప్ఫ’ కామెడీ
Publish Date:Jun 5, 2022
Advertisement
వెర్రి వేయివిధాలన్నారు. ఈ పాలుగారిది మరొక విధం. ప్రభు దర్శనం అయిందని ప్రచారం చేసుకున్న కె.ఎ.పాలు గారిది పాలుతాగే వయసు కాదు. ఆయన దృష్టిలో మనమే పిల్లలం.. దేశ ప్రధానితో సహా! పాలుగారికి విదేశాల్లో వూహించనంత వీర ఫాలోయింగ్ వుందని ఆయన అనుచరులతో పాటు స్వయంగా ఆయనే తెగ ప్రచారం చేసుకుంటుంటారు. లోకంలో ఏ దేశ ప్రధాని, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే పాలుగారి సువార్త చచ్చినట్టు వినితీరాల్సిందే. లేకపోతే ఆయనకు దేశ పాలన సాగదు. కె.ఎ.పాల్ గారికి భగవంతుడు ఇచ్చిన గొప్పవరం అది. దీన్ని కాదనే హక్కు స్వయానా పాల్ గారికే లేదు. ఎందుకంటే ఆయన నిఝంగానే ప్రపంచనేతలతో మాట్లాడేంత చనువు, వీలయితే ప్రపంచ యుద్ధాలను అమాంతం ఆపేయగల శక్తి కలిగినవాడు గనుక. చిత్రమేమంటే, అవేమీ చేయలేదు, అంత సులువుగా జరిగిపోయేవీ కావు. లోకాన్ని వుద్ధరంచాలని దైవాంశసంభూతులకు వుంటుంది. వారు మంత్రిలాగా సలహాలు.. అపుడపుడూ ఇవ్వడం విన్నాం, సినిమాల్లోనూ చూసేం. కానీ లోకాన్ని వుద్ధరించడమన్నది నావల్లే సాధ్యం.. లాభంలేదు మిత్రమా.. ధైర్యం చేయి ఢింభకా.. అని లోలోపల నాలుగు ధైర్య వచనాలు చెప్పుకుని ఏకంగా రాజకీయరంగంలోకి దిగడాన్ని పిచ్చికి పరాకాష్టగాక మరేమంటారు. ఏపీలోని ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల గ్రామంలో న్మించి దేశాన్ని ఉద్దరించే పాత్రలో దేశాటన చేస్తూ చక్కగా నవ్వుతూ తన అజ్ఞానాన్ని చాలా సరదాగా, చాలా సీరియస్‌గానూ తెలియజేసుకోవడం కేవలం కె.ఎ.పాల్ కి మాత్రమే సాధ్యం! తాను ఏది చెబితే అది ప్రపంచ నేతలు వింటారు, వింటున్నారని అంటూంటారు. మరి మన ప్రధానితో టీ తాగుతూ.. 'నాయనా, ముందు ప్రజలను ఉద్దరించు, వారి కష్టాలను తెలుసుకుని వారి అభివృద్ధికీ నాలుగు అడుగులు వేయి, ఎంతసేపూ అంబానీ, అదానీలే కాదు ఇంకా ప్రజలు వున్నారు' అని చెప్పారా! లేదు. సామాజంలో అన్యాయాలు, అక్రమాలు, హింసా పెరిగిపోతున్నాయి. సామాన్యులను ఆదుకోవాలని పాల్ చాలా అనుకుని రాజకీయాల్లోకి వచ్చేరట. మతప్రచారకులుగా ఎంతో పేరున్న పాల్‌గారికి రాజకీయాల రొంపిలో దిగితేనే అనుకున్నవి సాధ్యమవుతాయని గట్టి నమ్మకం కలగడమే విచిత్రం. ఈ ఆలోచన మరే ఆధునిక భక్తాగ్రేసుడుకీ తట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వెన్నంటి వుండే వీరాభిమానులు లెక్కకు మించి వున్నారని ప్రతీ సందర్భంలో పాల్ అందరికీ గుర్తు చేస్తుంటారు. ఎవరైనా మైకులో మాట్లాడుతూంటే అమాంతం గుమిగూడడం ఇక్కడి ప్రజల తత్వం. వాళ్లకో సరదా, కాలక్షేప మూను. దాన్ని వీరాభిమానం అనుకోవడం, ఓటుబ్యాంకు అనుకోవడమే అమాయకత్వం. అన్ని రాజకీయపార్టీల వారి మాదిరిగానే పాల్‌గారూ ఆ అమాయకత్వంలో పడ్డారు. నలుగుర్ని వెంటేసుకుని గట్టిగా మాట్లాడ్డం వంటపట్టించుకున్నారు. కానీ ఏంమాట్లాడుతున్నాను అనేదే అప్పుడు దారితప్పుతుంటుంది. ఓటు బ్యాంకును కొల్లగొట్టి రాజ్యాధికారం చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలవారు విశ్వయత్నం చేస్తుంటారు. కానీ పాల్ మాత్రం హేమాహేమీలయిన పార్టీలవారినే అంటే ఎన్నో ఏళ్ల రాజకీయానుభవం, బలగం వున్న నాయకులనే చచ్చుకుంటూ తనకు మద్దతునివ్వమని, అది వారి భవితకు ఎంతో మంచిదన్నది పాల్ ప్రవచనం. వొట్టి బోళామనిషి అనుకునేరు.. వొట్టి వెర్రితనం! లేకపోతే ఏ పార్టీ అయినా తన వల్లనే గెలుస్తుంది, తనను ఆశ్రయిస్తేనే మనుగడ సాగిస్తుందని భావించడం ఎప్పుడూ కనీ వినీ ఎరుగం. ప్రపంచదేశాధినేతలతో సరదా కబుర్లు చెప్పగలిగేంత పాల్ భారతదేశంలో, మీదుమిక్కిలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవమానాలు పడాలా తనను చాలా ఈజీగా తీసుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించాలా బైబుల్ పాఠాలు చెప్పి వేలాదిమందిని దగ్గరచేసుకోవచ్చు, భక్తులుగా మార్చుకోవచ్చు. ఆయనకు ఆ సత్తా వుండవచ్చు. కానీ ఈ రొంపి రాజకీయాల్లో, వ్యూహకర్తల మధ్య, ఏనుగులు, సింహాల నడుమ పిరికితనంతో కూడిన భయంతో మాటలు తడబడుతూ తిరగడం దేనికి లోకాన్ని వుద్ధరించడానికి అవతరించారా మహామహా నాయకులే పావులు నడపలేక ఏదో ఒక సమయంలో దెబ్బతిన్నారు. ఎంతోకాలం నుంచీ రాజకీయబురదలో కొట్టుకుంటున్నవారున్నారు. విదేశాల్లో ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించుకోవలసిన కె.ఎ.పాల్‌గారికి ఈ రాజకీయాల నదిలో తలమునకలు కావాలని ఎవరు ప్రవచించారో వారికి పాదాభివందనాలు. ఏమయినప్పటికీ, కె.ఎ.పాల్ రాజకీయ ప్రవేశం, ప్రయాణం ఈ కాలపు గొప్ప కామెడీ! దీనికి రచన, దర్శకత్వం అన్నీ ఆయనే. అహింసామార్గాన పయనించాల్సినవారు ఈ దారుణమార్గంలోకి మళ్లడానికి గల గట్టి కారణాలు తెలిస్తే బాగుండు. స్క్రిప్ట్ మరో విధంగా మార్చమని దేవుని ప్రార్ధించేది దేశమంతా!
http://www.teluguone.com/news/content/ka-paul-productions-great-comedy-25-137090.html





