నగ్న వీడియోలతో యువతికి బ్లాక్‌మెయిల్...రూ.1.10 లక్షల దోపిడి
Publish Date:Jun 27, 2026
Advertisement
స్నాప్‌చాట్ పరిచయం.. హోటల్‌లో ఉచ్చు..యువకుడు అరెస్ట్.. సోషల్ మీడియా పరిచయం ఓ యువతికి ఊహించని కష్టాలను తెచ్చిపెట్టింది. స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతిని ప్రేమ, నమ్మకం పేరుతో వలలో వేసుకున్న ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చివరకు హోటల్‌కు రప్పించి కత్తితో బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించి రూ.1.10 లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని (24) గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ కో-లివింగ్ పీజీ హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా స్నాప్‌చాట్ ద్వారా ఓ ఐటీ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని, నమ్మకం కలిగేలా మాట్లాడి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఐదు రోజుల క్రితం గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ సమీపంలోని ఎల్లో స్టోన్ హోటల్‌లో నకిలీ పత్రాలతో గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం మాయమాటలు చెప్పి రాత్రి 8 గంటల సమయంలో యువతిని హోటల్‌కు రప్పించాడు. అక్కడికి చేరుకున్న వెంటనే కత్తితో బెదిరించి ఆమె చేతులు కట్టేశాడు. అనంతరం నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించి, "డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను.. నీ తల్లిదండ్రులకు పంపిస్తాను" అంటూ బెదిరించాడు. భయాందోళనలకు గురైన బాధితురాలు గత్యంతరం లేక అతడు చెప్పినట్లే రూ.1.10 లక్షలను అతడి ఖాతాకు బదిలీ చేసింది. డబ్బు అందుకున్న తర్వాత కూడా నిందితుడు తెలివిగా బాధితురాలి మొబైల్ నంబర్‌తో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు ధైర్యం చేసి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నాగతేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి సెల్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అందులో మరో ఇద్దరు, ముగ్గురు యువతులకు సంబంధించిన నగ్న వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇదే తరహా నేరాలకు మరికొందరు యువతులు బలయ్యి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు విచారణను విస్తరించారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే.. తన చిన్న కుమారుడి చదువుకోసం నిందితుడి తల్లిదండ్రులు తమకున్న ఒక్క ఎకరం పొలాన్ని విక్రయించి వచ్చిన రూ.10 లక్షలను బ్యాంకు ఖాతాల్లో భద్రపరిచారు. అయితే వారికి తెలియకుండా ఆ మొత్తాన్ని నాగతేజ వారి ఖాతాల నుంచి తీసుకుని క్రికెట్ బెట్టింగ్‌లలో పోగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/k-nagateja-36-224385.html





