యువత, విద్యార్థుల ఉద్యమానికి దిగివచ్చిన జార్ఖండ్ సర్కార్.!
Publish Date:Aug 18, 2026
Advertisement
జెన్ జీ పవర్ ఏమిటో ప్రభుత్వాలకు తెలిసి వస్తున్నది. విద్యా వ్యవస్థలో అవకతవకలు, అక్రమాలు, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై యువత, విద్యార్థులు గళమెత్తి, వీధుల్లోకి వచ్చి చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వాలు ఒకదాని తరువాత ఒకటి అన్నట్లుగా దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా యువత చేపట్టిన ఉద్యమం ధాటికి మోడీ సర్కార్ దిగివచ్చి ధర్మేంద్ర ప్రసాద్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్ లో విద్యార్థులు, యువత తమ సమస్యలపై ఉద్యమ బాట పట్టారు. జార్ఖండ్ లోక్ సేవా ఆయోగ్ , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. దీంతో దిగి వచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థి, యువత డిమాండ్లను అంగీకరిస్తూ ప్రకటన చేసింది. టీడీపీఎల్ అనే ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు. వీటితో పాటు ఇటీవల నిర్వహించి వివాదాస్పద కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాటు, గతంలో జరిగిన అక్రమాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి అందుకు శ్రీకారం చుట్టారు. 2014 నుంచి జార్ఖండ్లో నిర్వహించిన అన్ని రకాల నియామక పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి సోరెన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై సిట్, సీఐడీ విచారణలు జరుగుతున్నాయి. సీజీఎల్ పరీక్షా విధానం ద్వారా ఎంపికైన కొందరు అభ్యర్థులకు అక్రమాలతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశాయి. కేవలం పరీక్షలు రాసిన అభ్యర్థులపైనే కాకుండా.. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్వహించిన థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ కంపెనీల పాత్రపై కూడా దర్యాప్తు జరగనుంది. Jharkhand Students Protest, Hemant Soren Decision, JSSC CGL Exam Cancelled, JPSC JSSC Aspirants Victory, Jharkhand Recruitment Exams Investigation
http://www.teluguone.com/news/content/jharkhand-students-protest-36-229144.html





