జేసీ హల్చల్.. ప్రగతిభవన్‌లోకి నో పర్మిషన్..
Publish Date:Jan 19, 2022
Advertisement
ప్రగతిభవన్ అంటే తెలుసుగా. ఇనుప కంచెలు, ఎత్తైన గేట్లు, పోలీసుల పహారాతో.. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం. లోపలెక్కడో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంతనాలు జరుపుతూ ఉంటారు. ఆయన్ను కలవాలన్నా.. ప్రగతిభవన్ గేట్ దాటాలన్నా.. అంత ఈజీ మాత్రం కాదు. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, సొంత పార్టీ నేతలకే పర్మిషన్ ఉండదు. అందుకేగా, ఈటల రాజేందర్ ఆ బానిస భవన్‌ను బద్దలు కొడతానంటూ పార్టీని వీడారు. అలాంటిది.. ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా వచ్చే.. లోనికి రానిస్తారా? ప్రగతిభవన్ గేటును కూడా తాకనీయకుండా.. అట్నుంచి అటే తిప్పిపంపించేశారు అక్కడి వారు. జేసీ లాంటి సీనియర్, ఫైర్‌బ్రాండ్ లీడర్‌కు ఇది ఘోర అవమానమే. అప్పుడప్పుడు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్చల్ చేసే జేసీ దివాకర్‌రెడ్డి.. ఎప్పుడుపడితే అప్పుడు ప్రగతిభవన్‌లోకి కూడా వెళ్లొచ్చని అనుకున్నారో ఏమో.. లేటెస్ట్గా ఆయన అలా ట్రై చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ దగ్గరకు వచ్చారు. అక్కడి పోలీసులు జేసీని అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ ఉందా? అని అడిగితే.. లేదు.. జేసీ వచ్చాడని చెప్పుపో.. అంటూ దివాకర్‌రెడ్డి దర్పం ప్రదర్శించారు. అయితే, ఆయన లెవల్ అక్కడ ఏమాత్రం వర్కవుట్ అవలేదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి ఎవరినీ అనుమతించేది.. అది జేసీ అయినా.. గీసీ అయినా.. జాన్తానై అంటూ పోలీసులు దివాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. చేసేది లేక పెద్దాయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ.. జేసీ దివాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు ఎందుకొచ్చినట్టో...? బిజినెస్ మేటరా? పొలిటికల్ ఇంట్రెస్టా? టీడీపీలో ఉంటూ జగన్‌రెడ్డి మావాడేనంటూ బిల్డప్ కొట్టే జేసీకి.. ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ దక్కకపోవడం షాకింగే.
http://www.teluguone.com/news/content/jc-diwakar-reddy-at-pragati-bhavan-39-130407.html





