పేరు చెబితే జాతకం చెబుతానన్న ఐఏఎస్....కొత్త కలకలం !
Publish Date:Jul 6, 2019
Advertisement
రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి చరిత్ర మా వద్ద ఉందని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీతో ప్రత్యేక ఆల్గారిథమ్ ఒకటి అభివృద్ధి చేశామని దాని ద్వారా ప్రతి వ్యక్తి యొక్క పబ్లిక్, ప్రైవేట్ సమాచారం దాదాపు 96, 97 శాతం కచ్చితత్వంతో తెలుసుకోగలమని, ఎవరిదైనా ఒకరి పేరు చెబితే వెంటనే వారి డిజిటల్ ఫుట్ ప్రింట్ నేను చెప్పగలనని తెలంగాణా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో ‘డిజిటల్ అకౌంటింగ్’ అనే అంశం మీద జరిగిన జాతీయ సదస్సు నిన్న సైబర్ కన్వెన్షన్‌లో ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్న ఈ సదస్సు లో జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటలైజేషన్‌తో ప్రజలకు పథకాలు అందేలా చేస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, అన్నారు. పేరు, తండ్రి/భర్త పేరు, చిరునామా ఈ మూడు అంశాలు చెబితే తెలంగాణలోని ప్రతి పౌరుడి ‘డిజిటల్ ఫుట్ ప్రింట్’ను క్షణాల్లో తెలుసుకోగలమని ఆయన పేర్కొన్నారు. అయితే పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణ మీద దేశవ్యాప్త చర్చ జరుగుతోన్న నేపధ్యంలో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గత ఎన్నికల సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న డేటా చోరీ అంశం దగ్గర నుండి వ్యక్తిగత సమాచారం అంశం కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలోమీ పేరు చెప్పండి.. నిమిషాల్లో మీ బతుకు కథేమిటో చెప్పేస్తానని చెప్పడం వివాదాస్పదయ్యే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఆధార్ ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకూడదని, ఆధార్‌ను అన్నిటికీ వర్తింపచేయరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినా ఈయన ఈరకమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
http://www.teluguone.com/news/content/jayesh-ranjan-comments-on-artificial-intelligence-39-87857.html





