జనవరి 9 ఎన్టీఆర్ మర్చిపోలేని రోజు.. ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా?
Publish Date:Jan 9, 2022
Advertisement
నందమూరి తారక రామారావు.. ఈ పేరే తెలుగు నాట ఒక సంచలనం. తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్. గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీ రామారావు సినిమా, రాజకీయ రంగాలను శాసించారు. తెలుగు, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు ఎన్టీఆర్. రాజకీయ రంగప్రవేశంతో మరో సంచలనంగా మారారు. రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ కు జనవరి9తో అవినాభావ సంబంధం ఉంది. జనవరి9 ఎన్టీఆర్ కు జీవితంలో మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న రామారావు.. 9 నెలల్లో 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అందుకే జనవరి 9 తెలుగు కీర్తి దిగ్దిశాంతాలు దాటిన రోజు.రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు.పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు. దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు.నాటి ఢిల్లీ పాలకులకు తెలుగువాడి వాడి,వేడి తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు.తెలుగు నేల పులకించిన రోజు.35 ఏళ్ల అహంకారానికి చరమగీతం పాడిన రోజు.సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు. ప్రజల మనిషిగా నిలిచిన ఎన్టీఆర్ రాజభవన్ గోడలు కాదన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీ కారం చేయాలని కోరుకున్నారు.రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు ఎవరూ రాజభవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు. జనవరి 9 వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం రికార్డు సంఖ్యలో రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడింది. చాలామంది లోపలికి వెళ్లలేక బయటే ఆగిపోయారు.ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ లారీల్లో,రైళ్ళలో,బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం అలముకుంది. జనవరి9న జరిగిన నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. గాంధేయవాది అయిన కె.సి. అబ్రహాం జనతా పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు.అంతకు ముందు పనిచేసిన రాష్ట్ర గవర్నర్లందరూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవారే.అలాంటి కెసీ అబ్రహాం గారు రాష్ట్రానికి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి గా రామారావు పదవీస్వీకార ప్రమాణం చేయించారు.ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు తాను మ్యానిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ పూర్తి చేస్తానన్నారు.ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని చెప్పారు. రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన దైనందిక జీవనశైలిలో మార్పులేదు.విశ్రాంతికి అవకాశమే లేదు.ప్రజాసంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.ఆయనకు అధికారం అంటే విలాసం అందుకే బాధ్యత. క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలన ఆయన జీవితసూత్రాలు. అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి.ముఖ్యమంత్రిగా జీతము తీసుకోనని రామారావు చెప్పారు.కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు. అందుకని నెలకు ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. వైభవోపేతమైన ముఖ్యమంత్రి నివాసానికి మారడానికి ఆయన అంగీకరించలేదు.తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు. ఖరీదైన విలాసమంతమైన కార్లను వద్దన్నారు. అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హోదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు.
http://www.teluguone.com/news/content/january-9-very-special-to-ntr-39-129928.html





