జైపాల్‌రెడ్డి పెద్దరికాన్ని కాపాడుకోవాలి!
Publish Date:Jul 14, 2014
Advertisement
గతంలో తెలుగు ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి అంటే అంతో ఇంతో గౌరవం వుండేది. రాజకీయాల్లో వుండే కొంతమంది పెద్దమనుషుల్లో ఆయన కూడా ఒకరన్న అభిప్రాయం వుండేది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన సీమాంధ్రులకు వ్యతిరేకంగా చేసిన పనులు, సీమాంధ్రులను ‘శుంఠలు’ అంటూ మాట్లాడిన తీరు చూశాక సీమాంధ్ర ప్రజలకు ఆయన మీద వున్న గౌరవం పూర్తిగా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే బాధ్యతను తన భుజాన వేసుకుని, కాంగ్రెస్ అధిష్ఠానానికి అబద్ధాల కబుర్లు చెప్పి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన కారణమయ్యారు. అందువల్ల ఆయనకు తెలంగాణ ప్రాంతంలో అయినా గౌరవం వుంటుందని అందరూ భావించారు. అయితే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన ఆయనకు తెలంగాణ ప్రాంతంలో కూడా గౌరవం లేదని అర్థమయిపోయింది. ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రాంతంలో అయినా పోయిన తన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో వున్నట్టున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన సీమాంధ్ర ప్రజల దృష్టిలో మరింత కిందకి దిగజారిపోతున్నారు. తాజాగా కేంద్రం లోక్‌సభలో పోలవరం ముంపు గ్రామాల బిల్లును ఆమోదించినప్పుడు జైపాల్ రెడ్డి అనవసరంగా ఆవేశపడిపోయారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సవరణలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ రాజ్యాంగం మొత్తం తనకే తెలిసినట్టుగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు చెల్లదని తేల్చిపారేశారు. అయితే ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పట్టించుకోలేదు. పోలవరం బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు అమలు కోసం బిల్లులో ఎలాంటి సవరణలైనా చేసుకోవచ్చని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారని గుర్తు చేశారు. మరి ఈ విషయం ఘనతవహించిన జైపాల్ రెడ్డి గారు కూడా గుర్తు చేసుకుంటే మంచింది. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డి భవిష్యత్తులో తన పెద్దరికానికి మరింత భంగం వాటిల్లే కామెంట్లు చేయకుండా వుంటారని సీమాంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jaipal-reddy-coments-on-polavaram-bill-45-35890.html





