ఢిల్లీ ఫలితాలతో జైలు సెంటిమెంట్ హుష్ కాకీ... కేటీఆర్ ఇప్పుడేం చేస్తారో?
Publish Date:Feb 10, 2025

Advertisement
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా రాజకీయ పార్టీల భ్రమలను పటాపంచలు చేసేశాయి. పలువురు నేతల ఆశలను అడియాశలు చేసేశాయి. మరీ ముఖ్యంగా సెంటిమెంటు పండితే చాలు అధికారం గ్యారంటీ అంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలకూ, నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి.
తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మధ్య ఎన్నికలలో అధికారం కోల్పోయిన పార్టీలకు గట్టి ఝలక్ ఇచ్చాయి. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ.. ఆ రోజు నుంచీ కూడా ఒక సెంటిమెంటును బలంగా నమ్ముకుని మళ్లీ అధికారంలోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.
ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని వైసీపీ కూడా సెంటిమెంటు పండిస్తే చాలు మళ్లీ అధికారపగ్గాలు మావే అన్న ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రెండు పార్టీలకూ కూడా గట్టి ఝలక్ ఇచ్చాయి. జైలు కెళ్లొస్తేనే, సానుభూతి కోసం వెంపర్లాడితేనో జనం ఓట్లు వేయరని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢంకా బజాయించి మరీ చెప్పాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలలో జైలుకి వెళ్లొస్తే ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ అన్న సెంటిమెంట్ ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు..
వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలా వీరంతా అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. దీంతో అధికారానికి అరెస్టు ఒక అడ్డదారి అన్న భ్రమల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, పార్టీలూ పడిపోయాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఎఫ్-1 రేసింగ్ కేసులో దమ్ముంటే తనని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చేసిన సవాలు వెనుక ఉన్న కారణం ఇదే. అంతే కాకుండా ఈ కేసులో తన అరెస్టు ఖాయమనీ, జైలులో యోగా చేసి మరింత ఫిట్ గా తయరై వచ్చి పాదయాత్ర చేస్తాననీ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకోండని అధికార కాంగ్రెస్ పార్టీని బతిమలాడుకుంటున్నారా అన్నట్లుగా వ్యవహరించారు. అయితే జైలు అధికారం సెంటిమెంటుకు రేవంత్ ఏమీ అతీతుడు కాదు కనుక.. కేటీఆర్ అరెస్టు విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న తొందర తనకేం లేదని కుండబద్దలు కొట్టేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ వెనకడుగు వేశారు. కేటీఆర్‌ని అరెస్ట్ కోసం పకడ్బందీగా వ్యూహాలు పన్నారనీ ఇహనో ఇప్పుడో అయన కటకటాల పాలవ్వడం ఖాయన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అరెస్టు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిందో ఏమో కేటీఆర్ అరెస్టు విషయంలో తనకు ఎటువంటి తొందరా లేదని వెనకడుగు వేశారు.
అయితే కేటీఆర్ కూడా నిన్నమొన్నటి వరకూ కేటీఆర్ ఎలాగైనా సరే అరెస్టవ్వాలన్న ప్రయత్నాలూ చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి కేటీఆర్ అరెస్టు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ఆ అరెస్టును తప్పించుకోవడం కోసం కేటీఆర్, బీఆర్ఎస్ లు ప్రయత్నాలు ప్రారంభిస్తాయని సెటైర్లు వేస్తున్నారు. జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులు అయిపోరనీ, జైలు కెళ్లడం అన్నది అధికారానికి అడ్డదారి ఎంత మాత్రం కాదనీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేసేశాయని అంటున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా అధికారం కోల్పోయారు. దీంతో నిన్న మొన్నటి వరకూ జైలుకెల్లాలని ఉబటాటపడిన కేటీఆర్ ఇప్పుడు జైలు మాటెత్తితేనే ఉలిక్కిపడుతున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jail-nsentiment-gone-with-delhi-assembly-election-results-39-192631.html












