కేరళలో మునిసిపల్ ఆఫీసుపై "జైశ్రీరామ్" నినాదాలతో బీజేపీ జెండాలు..
Publish Date:Dec 19, 2020
Advertisement
కేరళలోని పాలక్కాడ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం సాధించిన జోష్ లో ఆ పార్టీ కార్యకర్తలు పట్టణ మునిసిపల్ భవనంపై కాషాయ జెండాలు ఎగరేశారు. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటోలు ఉన్న భారీ బ్యానర్లను భవనం పై ప్రదర్శించారు. వాటిలో ఒక జెండాపై "జై శ్రీరామ్" అని నినాదం కూడా రాసి ఉంది. తాజాగా ఇది కాస్తా వివాదంగా మారింది. దీంతో మతపరంగా రెచ్చగొట్టే జెండాలను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారని పాలక్కాడ్ మునిసిపల్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాలక్కాడ్ లో బీజేపీ రెండోసారి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఏకంగా మునిసిపల్ కార్యాలయ భవనం ఎక్కి జెండాలు ప్రదర్శించారు. ఈ ఘటన తాలూకు వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారి వివాదానికి కారణమైంది. అయితే బీజేపీ తీరుకు నిరసనగా వామపక్ష కార్యకర్తలు శుక్రవారం పాలక్కాడ్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసారు. ఇది ఇలా ఉండగా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పాలక్కాడ్ బీజేపీ అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణ దాస్ తప్పుపట్టారు. "జై శ్రీరామ్ అనే నినాదాలు భారత్లో కాకుండా పాకిస్థాన్లో చేయాలా? జైశ్రీరామ్ అని రాసి ఉన్న జెండాలు ప్రదర్శిస్తే మతపరంగా రెచ్చగొట్టినట్లా? భావోద్వేగాలను దెబ్బతీసినట్లా?" అని కృష్ణ దాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
http://www.teluguone.com/news/content/jai-sri-ram-banner-on-palakkad-municipal-building-stokes-controversy-39-107913.html





