వచ్చేది మన ప్రభుత్వమే..కార్యకర్తల సంక్షేమమే నా తొలి కర్తవ్యం : వైఎస్ జగన్
Publish Date:Jun 24, 2026
Advertisement
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం.. మన తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కార్యకర్తల సంక్షేమమే తన తొలి కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల నియోజక వర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు వైఎస్ జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన వేముల మండలం భూమయ్యగారిపల్లి గట్టు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఆలయ కలశాన్ని ఎత్తుకొని ఆలయ ప్రవేశం చేసిన వైఎస్ జగన్ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం భూమయ్యగారిపల్లిలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం పులివెందుల పట్టణంలోని ఇరుగుడు పాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. *రాష్ట్రంలో కక్షపూరిత ప్రభుత్వం ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజా వనరుల దుర్వినియోగమే పాలకుల లక్ష్యంగా మారిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలే తమ బలమని పేర్కొన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పులివెందుల అభివృద్ధే ధ్యేయం అని ఆయన అన్నారు. పులివెందుల పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో భాకరాపురం, యర్రగుడిపల్లి, వైఎస్సార్ కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.150 లక్షల వ్యయంతో పూర్తి చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.భాకరాపురంలోని త్రిలోక్ మార్ట్ నుంచి శ్రీరాముని గుడి వరకు రూ.50 లక్షలతో, వైఎస్సార్ కాలనీలో రూ.50 లక్షలతో, యర్రగుడిపల్లిలో గరండాల బ్రిడ్జి సమీపంలో మరో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరానికి సంబంధించి మరో రూ.110 లక్షల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. చిన్న రంగాపురంలో రూ.40 లక్షలు, పెద్ద రంగాపురంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరి చేందుకు రూ.18 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేయనున్నట్లు, రోటరీపురం, చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల్లో యూజీడీ, రోడ్ల మరమ్మతు లకు రూ.70 లక్షల ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పులివెందుల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/jagans-visit-to-pulivendula-constituency-36-224060.html





