ఈ మాత్రం హడావుడి తప్పదు మరి
Publish Date:Oct 31, 2013
Advertisement
మరో ఆరు నెలలో రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తున్నఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి వస్తే ఇక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అతని చేతిలోకి వెళ్లిపోతాయని కొంత మంది చెప్పిన చిలుక జోస్యం ఎందుకో ఫలించలేదు. బహుశః సరయిన కార్డులు తీయకపోవడం వలననేమో జోస్యం తరచు తప్పుతూనే ఉంది. జైలు నుండి బయటకి వచ్చిన నాటి నుండి జగన్ ఎన్నిఐడియాలు ప్రయోగిస్తున్నపటికీ, పార్టీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. నిరాహార దీక్ష చేస్తే దానివల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు. హైదరాబాదులో శంఖారావం పూరిస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని ఎంత చెమటోడ్చినా అది (కిరణ్ లేఖల) జడివానలో కొట్టుకుపోయింది. శంఖారావం గురించి పాకెట్ మీడియా సాక్షిలో ఎంతగా శంఖం ఊదుకొన్నాఅది పార్టీ శ్రేణుల్లో ఎటువంటి చలనము కలిగించలేదు. పోనీ బులెట్ ప్రూఫ్ కారెక్కి రివర్స్ గేరేసుకొని మళ్ళీ తెలంగాణాలో ట్రయల్ రన్ వేసిరమ్మని విజయమ్మని పంపిస్తే, ఆవిడ చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు “ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా రాదు. మా పార్టీ మొదటి నుండి సమైక్యంద్రాకే కట్టుబడి ఉందని” తెలంగాణా గడ్డ మీదే నిలబడి తెగేసి చెప్పడంతో, తెలంగాణా ప్రజలు నల్గొండలో ఆమెను అడుగుపెట్టనీయకుండా వెనక్కి తిప్పి పంపేసారు. అందుకు ఆమె చెప్పిన కారణం ఇంకా ముచ్చటగా ఉంది. ‘తను వస్తే మళ్ళీ తెలంగాణా లో వైకాపా ఎక్కడ బలపడి పోతుందో అని బెంగ పెట్టుకొన్న కొందరు రాజకీయ నేతలే ఇదంతా వెనకుండి చేస్తున్నారని’ ఆమె ఆరోపించారు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక హంగామా చేస్తే తప్ప బండి నడవడం కష్టం. గనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానిని, రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింటుమెంటులు కోరారు. కారణం, ఇటీవల రాష్ట్రంలో కురిసిన వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోమని కోరేందుకు. పనిలోపనిగా తన సమైక్యాంధ్ర ఉద్యమం గురించి కూడా వారి చెవిలో వేసి, రాష్ట్ర విభజన వల్ల వచ్చే అనర్ధాల గురించి వాళ్లకి నూటకటోసారి నచ్చజెప్పి రావచ్చును. రాష్ట్రపతి ఎలాగు వచ్చేవారం హైదరాబాద్ వస్తున్నారు గనుక, ఆయనని ఇక్కడే కలిసేందుకు ప్రయత్నించవచ్చును. కానీ ప్రధానిని కలవాలంటే మాత్రం డిల్లీ వెళ్ళక తప్పదు. పనిలోపనిగా తండ్రి వంటి దిగ్విజయ్ సింగుని కూడా పలకరించి వస్తారేమో చూడాలి. ఈ కార్యక్రమాలు అయిపోయేసరికి మరో కొత్త ప్రోగ్రాములు ఏవయినా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేషనల్ పర్మిట్ కూడా వచ్చేసింది గనుక బహుశః సీమాంద్రాలో బస్సుయాత్ర మొదలుపెడతారేమో!
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-37-27051.html