పరామర్శించాల్సింది బాధిత కుటుంబాన్నా, నిందితుడినా జగన్?

Publish Date:Jul 30, 2026

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు   వైసీపీ అధినేత   జగన్  శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన చేసినన వ్యాఖ్యలు   కొత్త వివాదానికి తెరలేపాయి. సీదిరి అప్పలరాజును జైలులో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుట్ర చేశారని, అప్పలరాజు అంటే చంద్రబాబుకు అసలు పడదని, కక్షపూరితంగానే ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జగన్ గుప్పించిన విమర్శలు పరిశీలకులనే కాదు సామాన్య జనాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెబుతున్నట్లుగా ఈ కేసులో  రాజకీయ ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు  ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.  

సీదిరి అప్పలరాజు చేసిన  అతే..  ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.  నిర్లక్ష్యంగా బైక్ నడిపి  ఒక అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో..  నిజాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమేంటన్న చర్చ ఇప్పుడు జనంలో విస్తృతంగా జరుగుతోంది. కేసు ఏమిటంటే..  శ్రీకాకుళం జిల్లా పరిధిలో బుల్లెట్ బైక్‌తో ప్రమాదం జరిగి ఒక సామాన్య గొర్రెల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో బైక్ నడుపుతోంది సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాగా, తన కుమారుడిని ఈ కేసు నుండి తప్పించడానికి మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు. 

తన కొడుకు ఆరవ్‌ను బయట పడేసే క్రమంలో, ఆరవ్ స్నేహితుడైన  వేరే యువకుడిని ఈ కేసు ఒప్పుకునేలా ఒత్తిడి తెచ్చారు.  బైకు ప్రమాదం సదరు యువకుడే చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించి కేసు కూడా నమోదు చేయించారు.  అప్పట్లో సీదిరి మాటలను, ఆయన చెప్పిన కథనాన్ని నమ్మిన స్థానిక పోలీసులు, ఆరవ్ స్నేహితుడిపై  కేసు నమోదు చేశారు. అయితే ఈ  వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన గొర్రెల కాపరికి సీదిరి అప్పలరాజు రోడ్డుపై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని ప్రచారం చేసుకున్నప్పటికీ..  అది కూడా వాస్తవం కాదని, దారిన పోతున్న ఒక సాధారణ వ్యక్తి మాత్రమే ఆ సహాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు సీదిరి అప్పలరాజు   అబద్ధపు కథనాన్ని నమ్మి, అక్రమంగా కేసు నమోదు చేసినందుకు గాను శాఖాపరమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం, సంబంధిత సీఐ, ఎస్సైతో సహా పలువురు పోలీసులపై   చర్యలు తీసుకుంది. మొత్తం నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తప్పుడు కేసు కారణంగా నలుగురు పోలీసు అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడగా, మరోవైపు ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడింది.

సీదిరి కుమారుడు చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడిని తప్పించేందుకు కుట్రపూరితంగా వేరే వారిపై కేసు పెట్టించడంతో సిదిరి అప్పలరాజు కటకటాల పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయపార్టీ అధినేతగా జగన్ చేయాల్సిందేంటంటే.. బాధితుడి అంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి. అది వదిలేసి.. నిందితులకు పరామర్శలేంటన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  

Jagan Mohan Reddy, Seediri Appalaraju, Palasa accident case, Chandrababu Naidu, AP Political News, AP Police suspension

By
en-us Political News

  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.