లోకేశ్ టార్గెట్‌గా ఎమ్మెల్సీ స్కెచ్.. మంగళగిరిపై జగన్ స్పెషల్ ఫోకస్..
Publish Date:Nov 13, 2021
Advertisement
నిన్నకాక మొన్న వైసీపీలో చేరారు. అంతలోనే అడక్కముందే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేస్తున్నారు. మంగళగిరిలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మురుగుడు హనుమంతరావుతో నారా లోకేశ్‌ను టార్గెట్ చేసేలా స్కెచ్ వేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లను చీల్చాలనేది జగన్ ప్లాన్ అంటున్నారు. ఆ మేరకు మురుగుడును ఎమ్మెల్సీగా మంగళగిరి ప్రజలు ముందుంచుతున్నారు. ఇంతకీ జగన్‌రెడ్డికి మంగళగిరి అంటే ఎందుకంత భయం పట్టుకుంది? నారా వారి అబ్బాయి గెలుపును అడ్డుకోవడం వైసీపీ వల్ల అవుతుందా? ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటూ ఇటీవల సవాల్ చేశారు నారా లోకేశ్. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకల విధ్వంసకాండకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన 72 గంటల దీక్షలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. తాను మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. తొలి విజయం ఇక్కడ నుంచే గెలిచి తన తండ్రికి కానుక ఇస్తానన్నారు. ఈ స్టేట్మెంట్ వైసీపీ శ్రేణుల్లో ప్రకంపణలు సృష్టిస్తోంది. రాజధానిని మూడు ముక్కలు చేసి.. అమరావతిని అటకెక్కించేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ఇక్కడి ప్రజలు కడుపుమంటతో రగిలిపోతున్నారు. అమరావతి కోసం దీక్షలు, ధర్నాలు, పాదయాత్ర చేస్తున్నా సర్కారు తీరు మారడం లేదని మండిపడుతున్నారు. ఈ కోపమంతా వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించనున్నారు. మంగళగిరిలో ఈసారి నారా లోకేశ్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదంటున్నారు. అందుకే, లోకేశ్ తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పగానే.. అధికార పార్టీలో అలజడి చెలరేగింది. లోకేశ్‌ను అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సంధిస్తోంది. ఎమ్మెల్సీ రూపంలో లోకేశ్పైకి మాజీమంత్రి మురుగుడు హనుమంతరావును ప్రయోగిస్తోంది వైసీపీ. హనుమంతరావు బలమైన నాయకుడే. 1987నుంచి 1992 వరకు మంగళగిరి మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత 2000వ సంవత్సరం నుంచి 2009 వరకు వరుసగా రెండు సార్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్ మంత్రిగా కూడా చేశారు. 2013 నుంచి 2015 వరకు ఆప్కో చైర్మన్‌గా కొనసాగారు. ఆరేళ్ల విరామం తరువాత మళ్లీ ఇప్పుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి దక్కడం అనూహ్యమనే చెప్పాలి. ఇదంతా మంగళగిరిలో నారా లోకేశ్‌ను అడ్డుకునే వ్యూహనే అని చెబుతున్నారు. ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి ఆయన గెలుపు కష్టమేనని అంటున్నారు. అందుకే, పార్టీ పెద్దలు రంగంలోకి దిగి.. మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉంటాయి. అందుకే, ఆ వర్గానికి చెందిన మనుమంతరావును హడావుడిగా పార్టీలో చేర్చేసుకొని.. ఆయన అడగకముందే ఎమ్మెల్సీ అభ్యర్థిని చేసేశారు. మురుగుడుకు ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా పద్మశాలీల ఓట్లు తమ వైపునకు తిప్పుకునేలా స్కెచ్ వేశారు. కానీ, అమరావతిని జగన్ చేసిన ద్రోహం ముందు... ఈ కులాలు, వర్గాల ఎత్తుగడలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? మంగళగిరిలో ఈసారి నారా లోకేశ్ గెలుపును ఆపతరమా?
http://www.teluguone.com/news/content/jagan-mlc-scketch-to-target-nara-lokesh-in-mangalagiri-39-126295.html





