అసలు కంటే వడ్డీ గ్రేట్.. జగనన్న సర్కార్ కొత్త రికార్డు..
Publish Date:Nov 26, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇంతవరకు అప్పులు పుట్టించడంలో, అప్పులు చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు వడ్డీలు చెల్లింపులోనూ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం (2021) జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రాష్ట్రం కేవలం వడ్డీలకే రూ.5375 కోట్లు చెల్లించింది. ఇదే మూడు నెలలో కాలంలో చెల్లించిన అసలు రూ.4964 కోట్లు. అంటే అసలు కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీలు చెల్లించి పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఇదేదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవుని పాలన గిట్టనివాళ్ళు, ఆయనగారి కీర్తిని జీర్ణించుకోలేని రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా శ్రీ సర్కార్ వారే శాసన సభలో తమ ఘన కీర్తిని చాటుకున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో అధికారికంగానే ఈ విషయం ప్రకటించింది.ఇలా అసలు చెల్లింపుల కంటే వడ్డీల చెల్లింపులు ఎక్కవ ఉన్నాయంటే, అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22,740 కోట్ల వడ్డీలు చెల్లిస్తామని బడ్జెట్ పద్దులో తెలిపారు. కానీ, నిజానికి చెల్లించవలసిన వడ్డీల మొత్తం రూ.24 వేల కోట్ల వరకు ఉంటుందని ఆర్ధిక శాఖ అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వడ్డీల కోసం దాదాపు రూ.5,500 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో చెల్లించిన మొత్తం రూ.10,875 కోట్లకు చేరింది. మిగిలిన 6 నెలల్లో ఇంకా రూ.13,000 కోట్ల పైచిలుకు వడ్డీల కింద చెల్లించవలసి ఉంటుంది అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఈ విషయంలో ఏపీ కంటే అద్వాన్నంగా ఉన్న రాష్ట్రాలు ఒకటో రెండో ఉంటే ఉండవచ్చును. కానీ, ఆ రాష్ట్రాల అద్వాన్నస్థితికి, భౌగోళిక పరిస్థితులు, అదిక జనాభా వంటి ప్రత్యేక పరిస్థితులు కారణం కావచ్చును,కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం చేతకాక, అనుత్పాదక వ్యయాన్ని పెంచుకుంతున్న రాష్ట్రం మాత్రం ఏపీ ఒక్కటే కావచ్చును. ఏపీతో సమానంగా జనాభా విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలతో పోల్చితే అప్పుల్లోనే కాకుండా వడ్డీలు కట్టడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. అప్పులు, వడ్డీలు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.40,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్ల వరకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించవలసి ఉంటుంది. అప్పుల తాలూకు అసలు కింద రూ.15,500 కోట్లు, వడ్డీలు రూ.24,000 కోట్లు చెల్లించవలసి ఉంటుందని, అంటే అసలు చెల్లింపు కంటే వడ్డీ చేల్లిపు సుమారు రూ.10000 కోట్లు ఎక్కువ ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రభుత్వానికి కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు కలిపి రూ.34,142 కోట్ల ఆదాయం వచ్చింది.ఇది చాలక ఇదే మూడు నెలల కాలంలో రూ.18,958 కోట్లు అప్పు తెచ్చారు. ఆదాయం,అప్పులు కలిపితే మూడు నెలల్లో ప్రభుత్వ ఖజానాలో చేరిన సొమ్ములు రూ.53,101 కోట్లు. ఈ మూడు నెలల్లో సర్కార్ చేసిన ఖర్చు రూ.53,155 కోట్లు..ఇందులో పెట్టుబడి వ్యయం కేవలం రూ.2105 కోట్లు, అంటే ఈ మూడు నెలల కాలంలో పెట్టిన ఖర్చులో మిగిలిన మొత్తం పందారాల పథకాలు ఇతర అనుత్పాదక వ్యయం ఖాతాలో చేరిపోయింది. ఇవ్వన్నీ సత్యప్రమాణకంగా సర్కార్ వారు, శాసన సభకు చెప్పిన సత్యాలే.. ఎవరో చేసిన ఆరోపణలు కానే, కాదు. అంటే, సర్కార్ ఇచ్చిన వివరాల ప్రకారం చూసినా, ఏపీ బుడగ ముగిగిపోవదం ఖాయంగా కనిపిస్తోందని రతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-govt-paying--intrests-more-than-principles-39-127146.html





