జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా.. పార్టీ నేతల వ్యతిరేకతే కారణమా?
Publish Date:Jan 2, 2025
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ క్యాడర్, నేతలు వణికి పోతున్నారు. ఇప్పుడప్పుడే వద్దు మహప్రభో అంటూ వేడుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన బయటకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టుకుని జనం ముఖం చూడటానికి కూడా ఇష్టం లేని విధంగా వ్యవహరించారు. ఇక ఎన్నికలకు ముందు సిద్ధం సభల కోసం ఆయన బయటకు వచ్చినా.. ఆ సభలకు బెదరించి మరీ డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పథకాల లబ్ధిదారులను బెదరించి సభలకు తీసుకువచ్చేవారు. ఇది పక్కన పెడితే ఆయన పర్యటనల కోసం జనాలను తరలించడం అన్నది పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారిపోయేది. ఇక పథకాలకు బటన్లు నొక్కేందుకు ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభలకు పార్టీ నేతలు తరలించిన జనాలు జగన్ ప్రసంగం ప్రారంభించగానే పారిపోయేవారు. వారిని ఆపడానికి పోలీసులు, పార్టీ క్యాడర్ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించేవి కావు. ఇక పార్టీ పరాజయం తరువాత ఆయన జనం ముందుకు వచ్చే ధైర్యం చేస్తారని ఎవరూ భావించలేదు. పార్టీ నేతలూ క్యాడర్ కూడా ఇహ ఇప్పట్లో జగన్ సభలు ఉండవు, జనాలను తరలించే బాధ తప్పుతుందని ఆనందించారు. అయితే జగన్ మాత్రం ఉరుములేని పిడుగులా జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రతి బుధ గురువారాలలో ఈ పర్యటనలు ఉంటాయని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలు జనంలో పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ, క్యాడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికేనని ఆయన చెప్పారు. అయితే పార్టీ నేతలూ, కార్యకర్తలు మాత్రం ఆయన పర్యటనలను స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే పర్యటనలు వద్దు సార్ అంటూ ఆయనకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న మాట. ఈ నెల చివరి వారం నుంచి తన జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రకటించిన జగన్ ఆ పర్యటనలకు జగనన్న విత్ క్యాడర్ అని నామకరణం కూడా చేశారు. ఘోర పరాజయం నుంచి తేరుకుని ఇంత త్వరలో ఆయన జనంలోకి వస్తానంటూ చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులనే కాదు, సొంత పార్టీ క్యాడర్ ను కూడా ఆశ్చర్య పరిచింది.ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలతో, పార్టీ క్యాడర్ తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్, ఇప్పుడు జనంలో ఏమాత్రం ఆదరణ లేని పరిస్థితుల్లో, క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిన సమయంలో జిల్లాల పర్యటన పెట్టుకోవడం ఏమిటి? అసలాయన పర్యటన ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలు ముందుకు వస్తారా? అన్న అనుమానాలూ సర్వత్రా వ్యక్తం అయ్యాయి. సరే ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా జగన్ చెప్పా పెట్టకుండా తన జిల్లాల పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు నేతల నుంచి కానీ, క్యాడర్ నుంచి కానీ తన జిల్లాల పర్యటన ప్రకటనకు ఇసుమంతైనా స్పందన కానకారపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు ఏర్పాటు చేయడం తమ స్థోమతకు మించిన పనిగా మారుతుందని పార్టీ నేతలు భయపడ్డారు. అధికారం చేతిలో లేనందున జనాలను కూడా తరలించే పరిస్థితి ఉండదని జగన్ కు పార్టీ నేతలు నివేదించడంతోనే ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సరే పార్టీ నేతలూ, క్యాడరే వద్దంటున్నారని చెప్పుకోలేక జగన్ తన పర్యటన వాయిదా కోసం లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తెల వద్దకు వెళ్లనున్నట్లు, అందుకే జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అసలు జగన్ పర్యటనలపై ప్రకటన చేయడం, ఆ తరువాత సరైన కారణం లేకుండానే వాటిని వాయిదా వేయడం అన్నది ఆయన అధికారంలో ఉన్నటప్పటి నుంచీ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-districts-toous-postponed-39-190714.html