జగన్ చీకటి శాపం.. చంద్రబాబు ఆశాదీపం!
Publish Date:Jun 18, 2024
Advertisement
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పాలన ఏపీకి చీకటి శాపంగా మారితే.. జగన్ ప్రభుత్వ పతనం తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఆశాదీపంగా మారారు. సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలవరం, అమరావతి ఇలా రాష్ట్ర ఉజ్వలభవిష్యత్ కు దోహదం చేసే అన్నిటినీ జగన్ నాశనం చేస్తే ఇప్పుడు వాటిని మళ్లీ పట్టాలెక్కించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు చంద్రబాబు నడుంబిగించారు. సోమవారం పోలవరం సందర్శించిన సందర్భంగా చంద్రబాబు జగన్ రాష్ట్రానికి ఎలా శాపంగా మారారో వివరించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టును గత పభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. రూ.447 కోట్లతో మరమ్మతులు చేసినా బాగుపడుతుందనే గ్యారెంటీ లేదని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గత జగన్ సర్కార్ ఎంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చంద్రబాబు కళ్లకు కట్టినట్లు వివరించారు. మళ్లీ కొత్తగా డయాఫ్రేంవాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం అంచనా వ్యయం ఈ ఐదేళ్లలో పెరిగింది. తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టు, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క అడుగు ముందుకు పడలేదు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ ను తప్పించారు. విభజన చట్టంలో జాతీయ హోదా ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రమే చేపడితో ఏళ్లూ, పూళ్లూ గడిచినా పూర్తయ్యే అవకాశం లేదని భావించిన చంద్రబాబు తాను 2014లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే కేంద్రం నిధులు ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేస్తుందని గట్టిగా చెప్పి మోడీని ఒప్పించారు. అయితే ఆ తరువాత ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య ఏపీకి నిధులు, విభజన హామీల అమలు విషయంలో విభేదాలు తలోత్తడంతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విషయంలో మోడీ దాదాపు మెండి చేయి చూపారు. దీంతో చంద్రబాబు అప్పట్లో పోలవరం విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకు న్నారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఆ తరువాత కేంద్రం నిధులు విడుదల చేసినప్పుడు తీసుకోవాలని భావించారు. దీంతో ఆయన హయాంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెట్టిన రీతిలో జరిగాయి. అందుకే ప్రాజెక్టు దాదాపు 72శాతం పూర్తయ్యింది. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. జగన్ సర్కార్ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రాన్ని నిధులు కోరలేదు. కేంద్రం కూడా ఇవ్వలేదు. సరే రోగీ వైద్యుడూ కూడా చేతులెత్తేసిన చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని పడకేసేలా చేశారు. పనులు నిలిచిపోయాయి. అసలు జగన్ సర్కార్ అధికారం చేపట్టిన క్షణం నుంచీ ఏపీలో అభివృద్ధి ఆనవాళ్లు చెరిపివేయడమే లక్ష్యంగా అడుగులు వేసింది. రూ 2కోట్లతో చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను జగన్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూల్చివేసారు. అమరావతిలో నిర్మించిన భవనాలను పట్టించుకోలేదు. వాటిని పాడుపెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో వాటికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అలా కాకుండా జగన్ సర్కార్ ఆ భవనాలను అధికారుల నివాసాలకు కేటాయించి ఉంటే.. వారికి ఇచ్చే హెచ్ ఆర్ఎ మిగిలి ఉండేది. ఇలా జగన్ తన హయాంలో చేసినవన్నీ దండగమారి పనులే. ఒక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయం. జగన్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కేశారు. ఇక జగన్ చేసిన మరో నిర్వాకం, సకల నిబంధనలకూ తిలోదకాలిచ్చి, పర్యావరణ నియమాలకు చెల్లు చీటి పాడేసి విశాఖ పట్నం రుషికొండకు బోడి గుండు కొట్టేసి ఆ కొండపై అత్యంత విలాసవంతమైన హంగులతో భవనాలు నిర్మించడం. ఒక్క మనిషి అదీ సీఎం కోసం ఇంతటి భవనం అవసరమా అంటున్నారు.రూ.500 కోట్లతో పాతిక వేల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ భవనం టైల్స్ ఇటలీ నుంచి తెప్పించారని ఆరోపణలు ఉన్నాయి. బాత్ రూం లో టబ్ రూ.23లక్షలట.ఇవన్నీ విఐపీల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో విఐపీలకోసం ఈ భవనాన్ని నిర్మించామని చెబుతున్నారు. రాష్ట్రపతి,ప్రధాని,గవర్నర్ వంటి విఐపీల కోసం నిర్మించామని చెబుతున్నారు. ప్రజాధనంతో ఇంతటి విలాసవంతమైన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిర్మణాత్మకమైన ఖర్చులు కాకుండా ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి, సంపద సృష్టి అనే మాటను మరచి జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచులకు చేర్చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వాటి గురించి జగన్ సర్కార్ ఐదేళ్లలో పట్టించుకున్న పానాన పోలేదు. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను జగన్ సర్కార్ విస్మరించింది. తాగునీరు అందించడం కంటే మద్యం అమ్మకాలు పెంచుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. చెత్త మీద పన్ను వేసింది. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగింది. జగన్ హయాంలో ఏపీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదంతా సరిదిద్ది, రాష్ట్ర ప్రగతి, పురోగతిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన అడుగుల వేగం చూసి జనం ఇక రాష్ట్రానికి ఏం భయం లేదు అన్ని రంగాలలో పురోగమిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన విధ్వసానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో కూడా చంద్రబాబు కఠినంగానే ఉండాలని, తప్పు చేసిన ఏ ఒక్కరూ శిక్ష పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-curse-cbn-hope-39-178895.html





