తగ్గిన జగన్ అహం.. అందుకే మీడియాకి దాసోహం!
Publish Date:Oct 5, 2024
Advertisement
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి నేర్చుకున్న పాఠం ఏదైనా ఉందంటే అది మీడియా విలువ తెలుసుకోవడం ఒక్కటే. ఒక్క మీడయా విషయంలోనే ఆయన అహాన్ని తగ్గించుకున్నారు. మీడియాకు దాసోహం అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రెస్ మీటంటే మొహం చాటేసిన జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ ల ద్వారా మాత్రమే తన మొహం జనాలకు కనిపిస్తుందని అర్ధం చేసుకున్నారు. అందుకే ఓటమి తరువాత ఈ నాలుగు నెలలలోనూ ఐదు సార్లు మీడియా ముందుకు వచ్చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన ప్రెస్ ముందుకు వచ్చింది రెండంటే రెండు సార్లు మాత్రమే. అందులో ఒక సారి వీడియో రికార్డింగ్ ప్రెస్ మీట్. అది తీసేస్తే ఆయన వాస్తవంగా మీడియాతో మాట్లాడింది మాత్రం ఒకే ఒక్కసారి. అటువంటి జగన్ ఓటమి తరువాత నాలుగు నెలలలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రజలలో ఉండాలంటే, ప్రజలకు దగ్గర కావాలంటే మీడియా ద్వారా మాత్రమే సాధ్యం అన్న గ్రహింపునకు వచ్చారు. సరే జగన్ అహం తగ్గించుకుని, ఓ మెట్టు దిగానని భావించి మరీ ప్రెస్ మీట్లు పెడుతూ జనంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా, ఆయన మాటలూ, బాడీ లాంగ్వేజ్ జనాలను జగన్ కు మరింత దూరం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా మీట్ ల వల్ల ఆయనకు సానుకూలత మాట అటుంచితే ప్రజల నుంచి ప్రతికూలతే ఎక్కువ వస్తోందని అంటున్నారు.
తరచుగా మీడియా ముందుకు రావడం ద్వారా రాజకీయంగా బలపడాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆయన మీడియా ముందుకు రావడం ద్వారా తనకు తాను మరింత నష్టం చేసుకుంటున్నారని, పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి సారీ ఆయన మాటలు, చేతలు, హావభావాలూ అన్నీ సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ కు గురౌతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలన అరాచకత్వాన్ని నెటిజనులు ఎత్తి చూపుతున్నారు. ఆయన ప్రతి మాటనూ తిప్పికొడుతూ.. గతంలో ఆయన వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ కు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ద్వారా పొందాలనుకుంటున్న మైలేజ్ దక్కడం లేదు. ఆయన పార్టీ క్యాడర్, శ్రేణులూ జగన్ మౌనంగా ఉంటేనే మేలు అని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-changes-his-look-on-media-39-186277.html