బ్బా..బ్బా అంటున్న జగన్.. జోలె ఒక్కటే తక్కువ!
Publish Date:Feb 6, 2025
.webp)
Advertisement
అధికారంలో కొనసాగిన ఐదేళ్లూ ప్రజలకు నరకం చూపించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గట్టి షాకిచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో దారుణ ఓటమిని జీర్ణించుకోలేని జగన్.. వీలు చిక్కినప్పుడల్లా ప్రజలపై ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. నెలనెలా డబ్బులు ఇచ్చా.. అయినా నాకు ఓటు వేయలేదంటూ ప్రజలపై నిందలు మోపుతూ శాపనార్దాలు సైతం పెట్టాడు. దారుణంగా ఓడిపోయినా బుద్దిరాకపోవటంతో వైసీపీ నేతలుసైతం జగన్ తీరును జీర్ణించుకోలేక దూరం జరుగుతున్నారు.
ఈ క్రమంలో పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. విజయ సాయిరెడ్డి, మరి కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి జగన్ వింత చేష్టలను భరించలేమంటూ దూరమైపోయారు. ఇంకొందరు కూడా నేతలుసైతం రాజీనామా బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ మరో ఏడాదిలోనే ఉనికి మాత్రంగా కూడా లేకుండా పూర్తిస్థాయిలో నిర్వీర్యం అవుతుందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆయన చెప్పడం మీరెవరూ పార్టీని వీడకండి అంటూ నేతలను, కార్యకర్తలను ప్రాధేయ పడుతు న్నట్లుగా కనిపించింది. అదే సమయంలో తన సైకోయిజాన్ని జగన్ మళ్లీ బయటపెట్టుకున్నారు. ఈ సారి 30 ఏళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుంది.. ఈసారి జగన్ 2.0ను చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఐదేళ్లే భరించ లేకపోయిన జనం జగన్ కు మళ్లీ అధికారం అప్పగిస్తారా? 30 ఏళ్ల పాటు ఆయన అరాచకాలను భరిస్తారా? అంటూ వైసీపీ నేతలే సెటైర్లు వేసేలా జగన్ ప్రసంగం సాగింది.
జగన్ ద్వంద వైఖరి పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా జగన్ తీరు ఉందని.. వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధలోని వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో జగన్ సమావేశమైన సందర్భంగా జగన్ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు వైసీపీ చచ్చిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మరో వైపు 30ఏళ్లు మనం ఈ రాష్ట్రాన్ని పాలిస్తామంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలను అయోమయానికి గురిచేశారు. జగన్ ప్రసంగాన్ని విన్న ఆ పార్టీ నేతలు.. ఈయన ఇక మారడు బాబోయ్ అని తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చారు. అంతే కాదు.. ఇన్నాళ్లు కేవలం ప్రజల కోసమే పనిచేశా.. ఇప్పుడు జగన్ 2.0ను చూస్తారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా.. గతంలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనలో అయోమయం ఏ స్థాయిలో ఉందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్లలో జగన్ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నది ఆయన పార్టీకి గత ఎన్నికలలో దక్కిన ఘోర ఓటమే నిర్ద్వంద్వంగా తేల్చేసింది. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పిందేమిటంటే.. తాను ప్రజలనే కాదు పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోలేదని మాత్రమే. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మరో మారు గెలిపిస్తే 30 ఏళ్ల పాటు ప్రజలను పట్టించుకోను అని మాత్రమే.
నిజంగా ఐదేళ్ల తన పాలనలో జగన్ ప్రజలకు మంచి చేసిఉంటే వైసీపీ ఇప్పుడు అధికారం కోల్పో యేదా..? అధికారం దేవుడెరుగు.. కేవలం 11 సీట్లకే పడిపోయేదా.. 175 సీట్లలో గెలుస్తామంటూ ఎన్నికల ముందు పదేపదే చెప్పిన జగన్.. కేవలం 11 స్థానాలకే ఎందుకు పడిపోవాల్సి వచ్చింది..? ఇలాంటి విషయాలపై జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆలోచన చేయకపోవడంతో వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకోవడం మంచిదన్న భావనలోకి వచ్చేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అందుకు ఏ పార్టీ అతీతం కాదు. కానీ, ఓడిపోయిన తరువాత పార్టీ నేతలు, కార్యకర్తలను ఒకేతాటిపైకి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలి. ఆ బాధ్యతను పార్టీ అధినేత తీసుకోవాలి. గతంలో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారీ చంద్రబాబు అదే చేశారు. ఆయన ఎన్నడూ ఎప్పుడూ ప్రజలు నన్ను ఓడించారని వారిపై నిందలు వేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు అనేక అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు చేసిన పాలనకు ప్రజలు టీడీపీని ఒక్కసారికూడా ఓడించ కూడదు. కానీ, రాజకీయాల్లో గెలుపోటముల అనివార్యం. జగన్ ఆ విషయాన్ని ఇప్పటికీ గమనించక పోవటమే వైసీపీ వేగంగా పతనం కావటానికి కారణంగా మారుతోంది.
అధికారం కోల్పోయి ఏడు నెలలు అవుతున్నా.. జగన్ మాత్రం ప్రజలపై నిందలు వేస్తూ ఐదేళ్లు తాను సుపరిపాలన అందించినా జనం తనను ఓడించారని చెబుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. తద్వారా పార్టీని మరింత పతకానికి తీసుకెళ్తున్నారు. జగన్ తీరుతో వైసీపీ నేతలు కూడా విసుగు చెందుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీ అంటేనే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే జగన్ పాలనలో వైసీపీ నేతల అరాచకం ఆ స్థాయిలో కొనసాగింది.
జగన్ తానుఅధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ నేతలను, కార్యకర్తలను కలిసేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. బహిరంగ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలోనూ రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకొని వెళ్లారు. జనం ముఖం చూడటమే ఇష్టం లేదన్నట్లు వ్యవహరించారు. అటువంటి జగన్ కు ఇప్పుడు ఉన్నట్లుండి పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు.. అక్రమాస్తుల కేసులో త్వరలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ మోహన్ రెడ్డికి భావిస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లిన సమయంలో జగన్ పట్ల సానుభూతి వ్యక్తం అయ్యింది. ఆయనకు పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలూ, ప్రజలూ అండగా నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీని కీలక నేతలు వీడిపోయారు. ప్రజలలోనూ పార్టీ పట్ల ఆదరణ లేదు. తన పట్ల సానుభూతి లేదు. ఈ పరిస్థితుల్లో తాను అరెస్టైతే కనీసం నిరసన తెలపడానికి కూడా ఎవరూ ఉండరు. అందుకే పార్టీ నేతలూ, కార్యకర్తలను ఆయన పార్టీ వీడొద్దని బతిమలాడుకుంటున్నారు. మద్దతు కోరుతున్నారు. తన వెంట నిలబడాలని ప్రాధేయపడుతున్నారు. అయితే ఆయన ఎంత బతిమలాడుకున్నా వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈసారి జగన్ కోసం నిలబడే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-begging-party-leaders-and-cadre-39-192449.html












