నాలుగేళ్లూ గాలికి.. ఇకనైనా పని..జగన్ వేడుకోలు
Publish Date:Jun 8, 2023
Advertisement
వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమయ్యారా? అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకత వెనుక పార్టీ అధినాయకుడు క్యాడర్ విశ్వాసం కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు. అవును ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు, నాయకులు. నిజానికి, ఈరోజున అధికార పార్టీలో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య దూరం అంతో ఇంతో కాదు, అంచనాలకు అందనంతగాపెరిగింది.
ఇందుకు కారణం పార్టీ అధినేత కార్యకర్తలకే కాదు ముఖ్యసలహాదారు సజ్జలకు తప్ప మంత్రులకు కూడా కనిపించరని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అటువంటి ముఖ్యమంత్రి రాజకీయాలంటే మానవ సంబంధాలు అంటూ చాలా గంభీర ప్రకటన చేయడం పార్టీలో ఆయన పట్ల సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో భాగమే అంటున్నారు. ఎమ్మెల్యేలను టిక్కెట్టివ్వను జాగ్రత్త అంటే బెదరించకుండా, మంత్రులను మీ పనితీరు మెరుగు పరచుకుంటారా .. పీకేయ మంటారా ? హెచ్చరించకుండా.. నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోను అంటూ బుజ్జగింపులకు దిగడానికి కారణమదే అంటున్నారు. అయితే ఎంతగా స్వరం మార్చినా పార్టీ క్యాడర్ ఆయనను విశ్వసించే పరిస్ధితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా ఏప్రిల్ 7 న ప్రారంభమైన, ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వంపై వైస్పీ కార్యకర్తలు, స్థానిక నాయకుల్లో భగ్గుమంటున్న అసమ్మతిని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధాన్నీ బహిర్గతం చేసిందంటున్నారు. నిజానికి మా నమ్మకం న ువ్వే జగనన్నాకు ముందు ఏడాది కాలంగా సాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు జనం నాడి అర్థమైంది. అందుకే, గడప గడపకు కార్యక్రమంపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం లేక పోయింది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా దింపుడు కళ్ళెం ఆశతో చేపట్టిన మా నమ్మకం నువ్వే జగనన్నా కార్యక్రమంలోనూ వైసీపే నాయకులకు జనం నుంచి అవమానాలే ఎదురయ్యాయి.
దీనిని బట్టి చూస్తే వాస్తవానికి ఫెయిలైంది వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి నాయకత్వం. చాలా చాలా ఆలస్యంగానైనా జగన్ ఈ విషయాన్ని గుర్తించారనడానికి బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో జగన్ మాటలే నిదర్శనమని అంటున్నారు పరిశీలకులు. తొమ్మది నెలలు కష్టపడండి అధికారం మనదే అనడం వెనుక ఈ నాలుగేళ్ల వైఫల్యాలనూ మంత్రుల ముందు జగన్ అంగీకరించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-agrees-no-work-done-39-156539.html