జగన్ సమైక్యగానం ఓట్లు సీట్లకోసమేనా?
Publish Date:Nov 30, 2013
Advertisement
ఊహించినట్లే వైకాపా నేతల సమిష్టి కృషివల్ల శనివారం సాయంత్రం కుప్పంలో జరిగిన జగన్ సమైక్య సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ సభలో అతని సమైక్యాంధ్ర ఉద్యమం యొక్క అసలు ఉద్దేశ్యాలు కూడా అతనే మరోసారి స్వయంగా బయట పెట్టుకొన్నాడు. ప్రస్తుతం డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక జరిగిపోతూ, వచ్చే ఎన్నికలలోగానే రాష్ట్ర విభజన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంటే, అతను రాబోయే ఎన్నికలలో తనకి 30 యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్నివిడగొట్టకుండా ఆపుతానని హామీలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరుగకపోతే అతను చెపుతున్న మాటలకి అర్ధం ఉంటుంది. కానీ ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగిపోయి, అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడిపోయిన తరువాత, అతనిని గెలిపిస్తే విడిపోయిన రెండు రాష్ట్రాలను ఏవిధంగా సమైక్యపరచగలరో కూడా అతను వివరించి ఉంటే బాగుండేది. తను కోరుకొన్న విధంగా 30 యంపీ సీట్లు ఇచ్చి ప్రజలు తన పార్టీని గెలిపిస్తే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీకే మద్దతు ఇచ్చి, మనకు నచ్చిన వ్యక్తినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని అతను ప్రజలకు చెప్పడం అతని అహంభావానికి నిదర్శనం. ఇంకా ఇది సమైక్య రాష్ట్రమే గనుక, తెలంగాణాను కూడా వదులుకొన్న వైకాపా ఇప్పుడు కనీసం ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయింది. అటువంటి పార్టీకి అధ్యక్షుడయిన అతను కేంద్రంలో ప్రధానిగా ఎవరుండాలో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో తనే స్వయంగా నిర్ణయిస్తానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇక నేడు కూడా అతను మళ్ళీ 30 యంపీ సీట్లు గురించే మాట్లాడటం గమనిస్తే, అతను చేసేది సమైక్యవాదన, కానీ ఆలోచనలు మాత్రం ఓట్లు, సీట్ల గురించేనని అర్ధం అవుతుంది. అంటే సమైక్యవాదం ముసుగులో సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకొని రానున్న ఎన్నికలలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు గెలిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో తానే చక్రం తిప్పేయాలని ఆత్రం అతని ప్రతీ మాటలో వ్యక్తం అవుతోంది. మరో ఆసక్తికరమయిన సంగతి ఏమిటంటే సీమాంధ్రలో ఉన్నవి కేవలం 26యంపీ సీట్లు మాత్రమే, కానీ అతను 30 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు. మరి మిగిలిన ఆ 4 యంపీ సీట్లు ఎక్కడివి? అంటే బహుశః సీమాంధ్ర ప్రజలు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్ జంటనగరాలలో ఉన్న 3 సీట్లు, ఖమ్మంలో ఉన్న ఒక్కసీటు తామే గెలుస్తామని అతను భావిస్తున్నారేమో? ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే అందుకు అతను ఎంచుకొన్నవిధానమే చాలా తప్పు. ఒకప్పుడు తెరాస తెలంగాణా ఉద్యమాలతో ఏవిధంగా రాజకీయంగా బలీయమయిన శక్తిగా ఎదిగిందో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ఏవిధంగా ఎన్నికలలో లబ్ది పొందిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలలో బలంగా ఉన్నసమైక్యభావనలను వారి బలహీనతగా భావిస్తూ సమైక్యవాదం పేరుతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా రాష్ట్ర విభజన జరిగిపోతున్న ఈ తరుణంలోనేకాక, విడిపోయిన తరువాత కూడా సమైక్య సెంటిమెంటుతో ఓట్లు పిండుకోవాలని అనుకోవడం చాలా హేయమయిన రాజకీయం. నిజం చెప్పాలంటే సీమాంధ్రలో కాంగ్రెస్, తెదేపాలకు ఎటువంటి బలమయిన క్యాడర్ ఉందో, అదేవిధంగా కారణాలేవయినప్పటికీ జగన్ని అభిమానించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అటువంటప్పుడు అతను చెప్పుకొంటున్న నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేసుకొంటే, వారే కాదు ఇతరులు కూడా అతని వైపు ఆకర్షితులయ్యే వారేమో! కానీ అతని ఆలోచనా విధానము, వ్యవహార శైలి ఎప్పుడూ విచిత్రమే, అనుమానాస్పదమే. నేటి సభలో అతను పలికిన మాటలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి అతను సమైక్యాంధ్ర కోసం ఈ సభ నిర్వహించి ఉంటే, రేపటి నుండి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాలు మొదలుపెడదామని ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండాలి. కానీ, 30 యంపీ సీట్ల గురించి, డిల్లీలో చక్రం తిప్పడం గురించి మాట్లాడారు. ఎన్నికలలో తన పార్టీ గెలిచేందుకు అతను ఈవిధంగా సమైక్యసభలో, ఓదార్పు సభలో నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించే బదులు, ముందుగా తన పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకొని, ఆ తరువాత ప్రజలవద్దకు వెళ్లి ఈ డొంక తిరుగుడు మానుకొని, నేరుగా తనకే ఓటేసి గెలిపించమని, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకొంటున్నారో చెప్పుకొంటే అతను పోగొట్టుకొన్న ‘విశ్వసనీయత’ మళ్ళీ పెరిగి, రానున్న ఎన్నికలలో విజయం సాధించవచ్చునేమో! కానీ, ఈవిధంగా ప్రజల బలహీనతమీద ఆడుకొని అడ్డు దారిలో విజయం సాధించాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
http://www.teluguone.com/news/content/jagan-45-27947.html