ట్రంపరితనంపై మండి పడ్డ ఇటలీ!.. మెలోనీపై అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన
Publish Date:Jun 20, 2026
Advertisement
అంతర్జాతీయ రాజకీయ వేదికలపై దేశాధినేతల మధ్య నడిచే దౌత్య సంబంధాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీశాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుడ్ ఫ్రెండ్ గా గుర్తింపు పొందిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దౌత్యపరమైన ఉద్రిక్తతలను పెంచాయి. ఇటీవల జరిగిన జీ7 సదస్సులో పీఎం జార్జియా మెలోని తనతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆరాటపడిందని, ఆమెను చూసి జాలిపడి మాత్రమే తాను ఆ సెల్ఫీకి అంగీకరించానంటూ ట్రంప్ ఒక ఇటాలియన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక దేశ మహిళా ప్రధానమంత్రిని ఉద్దేశించి, అగ్రరాజ్యాధినేత ఈ తరహాలో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అయితే.. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కల్పిత కథలని ఇటలీ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ దౌత్య అవమానానికి నిరసనగా జూన్ 21, 22 తేదీల్లో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని చేపట్టాల్సిన అధికారిక అమెరికా పర్యటనను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రధాని పట్ల ట్రంప్ మాట్లాడిన తీరు అత్యంత అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల పర్యవసానాలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ వివాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని.. ఆయన మాటలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మెలోని అన్నారు. అమెరికా అధ్యక్షుడు మిత్రదేశాల అధినేతలతో ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదన్న మెలోనీ.. ఇలా జరగడం ఇది మొదటిసారేమీ కాదని అసహనం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా ప్రత్యర్థుల పట్ల చూపించని మొండితనాన్ని, మిత్రదేశాలపై చూపించడం ట్రంప్‌కు తగదని మెలోని విమర్శించారు. శత్రువుల విషయంలో ఎంతో మృదువుగా వ్యవహరించే ట్రంప్.. మిత్రులపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. తాను కానీ, తన దేశం ఇటలీ కానీ ఎవరి ముందూ ఎన్నటికీ మోకరిల్లవు, దేనికోసం యాచించవు అని మెలోనీ పేర్కొన్నారు. ఇటలీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ప్రధాని మోదీతో కలిసి దిగిన సెల్ఫీలు, వారి మధ్య ఉన్న దౌత్యపరమైన స్నేహం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మెలోనిపై, ట్రంప్ లాంటి అగ్రనేత చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ట్రంప్ తీరు అంతర్జాతీయ దౌత్య నీతికే మచ్చ తెచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/italy-lashes-out-at-trumps-behavior-36-223581.html





